జగన్ దృష్టికి టూరిజం ఉద్యోగుల సమస్యలు
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం (ఏఐటీయూసీ) మంగళవారం వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని తాడేపల్లిలో కలిసింది. కూటమి పాలనలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు . కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 23 ద్వారా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు చెందిన 22 హోటల్స్, రిసార్ట్స్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకోవడం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తుంది . “గత 25 సంవత్సరాలుగా టూరిజం సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో 504 మంది, ఔట్‌సోర్సింగ్ ద్వారా 488 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. కొత్త జీవో వల్ల మా ఉద్యోగ భద్రత పోయే పరిస్థితి ఏర్పడింది. టూరిజం ఆస్తులను ప్రైవేట్ చేతుల్లోకి ఇస్తే మా కుటుంబాలు రోడ్డున పడతాయి” అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ అంశంపై స్పందించిన వైఎస్ జగన్, టూరిజం కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వైసీపీ అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.