Andhra PradeshHome Page Slider

అక్కచెల్లెమ్మలకు అన్నింటా ఆసరా- జగన్

Share with

తమ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అనీ,  ప్రతీ పథకంలోనూ మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహిస్తోందని ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. దెందులూరులోని పబ్లిక్ మీటింగులో వైయస్సార్ ఆసరా పథకం గురించి మాట్లాడారు జగన్. వైయస్సార్ ఆసరా పథకంలో పొదుపు సంఘాల మహిళలకు పెట్టుబడులను అందిస్తోందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని, వాటిలో కూడా మహిళలకే పెద్దపీట వేస్తున్నామన్నారు. స్వయం ఉపాధి మార్గాలలో అక్కచెల్లెమ్మలకు నైపుణ్యం ఉన్న రంగాలలో వ్యాపారాలు చేయడానికి వైయస్సార్ చేయాతను అందిస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ పది లక్షల మందికి చేయాతనిచ్చామని, వారు వ్యాపారాలలో రాణిస్తున్నారని తెలియజేశారు.

పొదుపు సంఘాల మహిళలకు ఏటా 30 వేల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాల ద్వారా అందిస్తున్నామన్నారు. బ్యాంకు రుణాల చెల్లింపులలో కూడా మహిళలు రాణిస్తున్నారని, మొత్తం పూర్తిస్థాయిలో రుణాలు తీరుస్తున్నారని తెలియజేశారు.  తమ ప్రభుత్వం బాధ్యతగా బ్యాంకర్లతో మాట్లాడి, వడ్డీ రేటును 13 శాతం నుండి 9 శాతానికి తగ్గించామని వివరించారు. తనను వారి బిడ్డగా, అన్నతమ్ముడుగా భావించి మహిళలు ఆదరిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో కుంటు పడిన పొదుపు సంఘాలు రుణాలు సరిగా పొందలేక పోయారని, రుణాల చెల్లింపులు కూడా కష్టంగా ఉండేదన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో అక్కచెల్లెమ్మలు రుణాలు పొందారని, చెల్లింపులు కూడా సక్రమంగా తీరుస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

చంద్రబాబు  ప్రభుత్వం కల్లబొల్ల మాటలతో బ్యాంకుల ద్వారా రుణమాఫీ చేయిస్తామని చెప్పారని, కానీ వారితో పని అయిపోయిన తర్వాత రుణమాఫీని గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అమ్మఒడి, వైయస్సార్ ఆసరా, కాపు నేస్తం , ఈబీసీ నేస్తం, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా మహిళలకు మాత్రమే వేల కోట్ల రూపాయలు అందిస్తున్నామన్నారు. జగనన్న ఇళ్ల పథకంలో మహిళల పేరుతోనే ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు.