BusinessHome Page SliderTelangana

హైదరాబాద్‌లో త్వరలో  ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ డేటాకేంద్రం

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, తెలంగాణా మంత్రి కేటీఆర్ నిన్న (శుక్రవారం) భేటీ అయిన సంగతి తెలిసిందే. కేటీఆర్ ట్విట్టర్లో తమ భేటీ గురించి ప్రస్తావిస్తూ బిర్యానీ, బిజినెస్‌ల గురించి మాట్లాడుకున్నామన్నారు. అలాగే హైదరాబాద్ నగరం సిగలో మరో ఐటీ పుష్పాన్ని తీసుకొస్తున్నారు కేటీఆర్. మైక్రోసాఫ్ట్ సంస్థ 2025 నాటికి 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో మైక్రోసాఫ్ట్ డేటా కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని సత్యనాదెళ్ల తెలియజేశారు.

ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ ప్లాట్‌ఫారానికి డిమాండ్ పెరుగుతోందన్నారు. ఇప్పటికే సాంకేతికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ కు చెందిన క్లౌడ్ పోర్ట్‌ ఫోలియో, డేటా సొల్యూషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రొడక్టివిటీ టూల్స్, పరిశ్రమలు, అంకురాలు, డెవలపర్ల కోసం అధునాతన సెక్యూరిటీ వ్యవస్థతో డేటాకేంద్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణా ప్రభుత్వ విధానాలు, ఐటీ నిపుణులు అత్యధిక లభ్యత వంటి కారణాలతో చాలా కంపెనీలు డేటా కేంద్రాల ఏర్పాటుకు ముందుకువస్తున్నాయన్నారు.

కేటీఆర్ మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ తమ రెండవ అతిపెద్ద ప్రాంగణాన్ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తోందని, వివిధ రంగాల్లో అభివృద్ధికి సహకరిస్తోందని తెలిపారు. అమెజాన్ కంపెనీ కూడా 36 వేల కోట్లతో అతిపెద్ద డేటా కేంద్రాలను స్థాపిస్తోందని తెలియజేశారు. మరిన్ని పెట్టుబడులు హైదరాబాద్‌లో పెట్టవలసిందిగా మైక్రోసాఫ్ట్ సీఈవోను కోరారు.