‘నాకు ఓట్లు రాకపోయినా పర్వాలేదు..ధర్మాన్ని కాపాడుకోవాల్సిందే’..పవన్
సనాతన ధర్మాన్ని మూర్ఖంగా సపోర్టు చేసే నాయకుడిని తాను కాదని, అన్ని మతాలను గౌరవించమని చెప్పే హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇతర మతాల వారి కన్నా, హిందూధర్మంపై నమ్మకం లేని హిందువులే హిందూమతంపై, వారి నమ్మకాలపై దెబ్బకొడుతున్నారని పేర్కొన్నారు. ఓట్ల కోసం సెక్యులరిజాన్ని అడ్డం పెట్టుకుని సనాతన ధర్మాన్ని కించపరిచే రాజకీయ నాయకులపై ధ్వజమెత్తారు. తనకు ఓట్లు రాకపోయినా పర్వాలేదు. ధర్మానికి, భగవంతునికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. రామాయణ, మహాభారతాలకి శాస్త్రపరమైన ప్రమాణాలు ఉన్నాయని, అవి పుక్కిట పురాణాలు కాదని తనకు నమ్మకం ఉందన్నారు. రాముడు, కృష్ణుడు వంటి పురాణ పురుషులు ఎప్పుడు పుట్టారో, ఎప్పుడు ఏ యుద్ధం జరిగిందో తిథి, వార, నక్షత్రాలతో సహా కావ్యాలలో ప్రమాణం ఉందన్నారు.