గాజాలోని చిన్నారులపై ఇజ్రాయెల్ నేత సంచలన వ్యాఖ్యలు..
“పసిపిల్లలనే జాలి మాకు లేదు, మాకు కావల్సింది గాజా భూభాగం మాత్రమే, ఆ నగరాన్ని ఆక్రమించుకుని అక్కడ స్థిరపడాలి, మాకు హమాస్ మాత్రమే కాదు, గాజాలోని ప్రతీ బిడ్డా మాకు శత్రువే” అంటూ ఇజ్రాయెల్ నేత మోషే ఫైగ్లిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాజాలో చిన్నారులు ఆకలితో చనిపోతున్నారని, రాబోయే రెండ్రోజుల్లో 14 వేల మంది పిల్లలకు మృత్యుగండం ఉందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ నేత ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఇప్పటికే యుద్ధం మొదలుపెట్టినప్పడి నుండి 53 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో బ్రిటన్ కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నిలిపివేసింది. గాజాలోకి మానవతా సాయాన్ని కూడా ఇజ్రాయెల్ ఆపి వేసింది. అతి కొద్ది మొత్తంలో మాత్రమే అనుమతిస్తోంది. దీనితో ప్రపంచదేశాలు మండిపడుతున్నాయి.