బీజేపీపై పోరులో కాంగ్రెస్‌కు తృణముల్ దగ్గరవుతోందా?
ప్రతిపక్ష ఐక్యతలో ఇవాళ అరుదైన దృశ్యం ఆవిష్కృతమయ్యింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష వ్యూహాత్మక సమావేశంలో కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ వచ్చి చేరింది. రాహుల్ గాంధీ ఎంపీగా అనర్హత వేటుకు వ్యతిరేకంగా నల్ల దుస్తులతో విపక్షాలు నిరసనలు జరిపాయి. తృణమూల్‌కు చెందిన ప్రసూన్ బెనర్జీ, జవహర్ సిర్కార్ ఈరోజు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో వ్యూహాత్మక సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలకు సమాన దూరంలో ఉంటామని మమత బెనర్జీ ఇప్పటికే ప్రకటించినా.. తాజా పరిణామాలు కొత్త ఆలోచనలకు కారణమవుతున్నాయి.
ఐతే ఇది కేవలం రాహుల్ గాంధీపై చర్యలకు నిరసనకు మాత్రమే మద్దతని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తృణమూల్ రాక కాంగ్రెస్ పార్టీలో ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఎవరు ముందుకొచ్చిన వారిని కాంగ్రెస్ స్వాగతిస్తుందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు, ప్రజలను కాపాడేందుకు ఎవరైనా ముందుకు వస్తే వారిని స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యర్థి అయిన కె చంద్రశేఖర్ రావుకు చెందిన భారత రాష్ట్ర సమితి, శివసేనతో కలిసి “నల్ల చొక్కా” నిరసనలో చేరింది. నేను సవార్కర్‌ను కాను, గాంధీనంటూ రాహుల్ వ్యాఖ్యల తర్వాత, క్షమాపణలు చెప్పాలని.. శివసేన రాహుల్ ను డిమాండ్ చేసినప్పటికీ ఇవాళ విపక్షాల ఉమ్మడి ఆందోళనలో ఆ పార్టీ పాల్గొంది.

