బీజేపీ అగ్ర నేతలపై ఉక్కుపాదం..!
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ.. ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా కామెంట్స్ చేస్తూ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారన్న ఆరోపణలపై రాజాసింగ్‌ను అరెస్టు చేశారు. బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా దీక్షకు కూర్చున్న బండి సంజయ్‌ను కూడా పోలీసులు జనగామ జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు.

రాజాసింగ్ 10 నిమిషాల వీడియో
స్టాండప్ కమేడియన్ మునావర్ ఫారూఖీ ఇటీవల హైదరాబాద్‌లో షో నిర్వహించారు. ఈ షోను అడ్డుకుంటామన్న రాజాసింగ్‌ను గతంలో గృహ నిర్బంధం చేశారు. అయితే, మునావర్ ఫారూఖీ గతంలో హిందువుల మనోభావాలను కించపరిచారంటూ రాజాసింగ్ సోమవారం ఓ 10 నిమిషాల 27 సెకన్ల వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో ఓ వర్గం ప్రజలు హైదరాబాద్ పాత బస్తీలో ఆందోళనకు దిగారు. ప్రవక్త పేరు ఎత్తకుండా ఆయన పరోక్షంగా ఆరోపణలు చేశారని డబీర్‌పురా, గోషామహల్, నాంపల్లి సహా పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్ ఎదుట బైఠాయించారు. రాజాసింగ్‌ను అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున నినదించారు. దీంతో షాహినాయత్ గంజ్ పోలీసులు మంగళవారం ఉదయమే రాజాసింగ్ ఇంటిని చుట్టుముట్టారు. అరెస్టు సమయంలో ఎమ్మెల్యే ఇంటి వద్ద, గోషామహల్‌లో పోలీసులను భారీగా మోహరించారు. పోలీసుల సూచన మేరకు రాజాసింగ్ వీడియోను యూట్యూబ్ తొలగించింది.

వివిధ ప్రాంతాల్లో హై అలర్ట్
ముస్లింలు ఎక్కువగా ఉన్న నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, వికారాబాద్, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాజాసింగ్, బండి సంజయ్‌ల అరెస్టును నిరసిస్తూ బీజేపీ, వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఆందోళనలు చేపట్టే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు.

బండి సంజయ్ ధర్మ దీక్ష భగ్నం
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ.. ఆ కేసులను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో బండి సంజయ్.. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం పామ్నూరులో తన ప్రజా సంగ్రామ యాత్రా స్థలంలోనే ధర్మ దీక్షకు దిగారు. ఈ దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. బండి సంజయ్‌ను తరలిస్తున్న పోలీసు వాహనానికి బీజేపీ కార్యకర్తలు వలయంగా ఏర్పడి అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దారి పొడవునా పోలీసులను బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. బండి సంజయ్‌ను కరీంనగర్‌కు తరలించారని సమాచారం.
ఉదయం నుంచే భారీగా పోలీసుల మోహరింపు
అంతకు ముందు బండి సంజయ్ పాదయాత్రను టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకుంటారన్న సమాచారం అందిందంటూ ఆయనకు భద్రతను పెంచుతామని పోలీసులు తెలిపారు. అయితే, తనకు అదనపు భద్రత అవసరం లేదని, తన భద్రతను పార్టీ కార్యకర్తలే చూసుకుంటారని బండి సంజయ్ తెగేసి చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబ దమన నీతిపై ధర్మ దీక్షకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. దీంతో తొలుత శిబిరం వద్ద మోహరించిన పోలీసులు.. ఆయన భద్రత కోసమే అరెస్టు చేస్తున్నట్లు చెప్పి అదుపులోకి తీసుకున్నారు. దీంతో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును టీఆర్‌ఎస్ సర్కారు కాలరాస్తోందంటూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. బండి సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ ఫోన్‌లో పరామర్శించారు.
అరెస్టులకు కిషన్ రెడ్డి, ఈటల ఖండన
బండి సంజయ్ అరెస్టును కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునే కుట్ర పన్నుతున్నారని, కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలనను గద్దె దించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాజాసింగ్ అరెస్టును కూడా ఈటల రాజేందర్ ఖండించారు. కేసులతో, అరెస్టులతో బీజేపీని అడ్డుకోలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో నిర్బంధించిన 29 మంది బీజేపీ కార్యకర్తలను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

