కేరళ నరబలి కేసులో మతిపోయే విషయాలు
ప్రపంచం ఎంతగా సాంకేతిక, వైజ్ఞానిక రంగాలలో ముందుకు పోతోందో, కొంతమంది మూర్ఖత్వపు మూఢనమ్మకాలతో అంతగా వెనక్కు పోతోంది. కేరళలో ఇటీవల జరిగిన నరబలి ఉదంతం.. దేశాన్ని ఒక్కసారిగా నివ్వెరపోయేలా చేసింది. ఆర్థికంగా దెబ్బతిన్న ఓ జంట డబ్బుపై ఆశతో ఇద్దరు మహిళలను బలి ఇచ్చారు. ఈ కేసులో మరోవ్యక్తి ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ వారి నేరాన్ని అంగీకరించారు. తాంత్రికుడు చెప్పాడని వీరు రోజెలిన్, పద్మ అనే ఇద్దరు మహిళలను కట్టేసి, క్రూరంగా చంపి, ఆపై ముక్కలు చేసినట్లు తెలుస్తోంది. రోజెలిన్ జూన్ నుండి కనిపించలేదు. ఎర్నాకులంకు చెందిన పద్మ సెప్టెంబరు నుండి ఆచూకీ లేదు. దీనితో పద్మ మిస్సింగ్ కేసు చేపట్టిన పోలీసులకు ఈ నరబలి వ్యవహారం తెలిసింది. ఈ భగవంత్ సింగ్ మసాజ్ థెరపిస్ట్ కావడంతో డబ్బు ఆశే కాకుండా వీరు లైంగిక ఆనందం, తాంత్రిక పూజల కోణంలో కూడా ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో నిందితులను 14 రోజుల రిమాండ్ విధించారు.

అయితే వారి అవశేషాలు కూడా దొరకకపోవడంతో పోలీసులకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. క్లూస్ టీమ్‌కు మృతుల శరీరభాగాలు ఎక్కడా లభ్యం కాలేదు. దీంతో నిందితులు వారిని బలిచ్చి, తినేసి ఉంటారనే అభిప్రాయానికి వస్తున్నారు. జూన్ 8 ఒకరిని, సెప్టెంబరు 26న ఒకరిని సాయంత్రం ఆరుగంటలకు నరబలి ఇచ్చినట్లుగా విచారణలో తేలింది. నిందితురాలు లైలా ఈ విషయంలో వాగ్మూలం ఇచ్చింది. పద్మను 56 ముక్కలు చేసినట్లుగా అంగీకరించింది. భగవంత్ సింగ్ మాత్రం నోరు తెరవలేదు. భగవంత్ సింగ్, లైలా దంపతులకు వారి స్నేహితుడు షఫీ కూడా సహకరించినట్లు తెలిసింది. బలి ఇచ్చిన ఇద్దరు మహిళల శరీరభాగాలు కానీ, కాల్చిన లేదా పూడ్చిన ఆనవాళ్లు కానీ ఎక్కడా దొరకలేదు. దీనితో వారిని మరోసారి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.

అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం షఫీనే ముఖ్య నేరస్తుడని, మహిళలను క్రూరంగా హింసించి, వారు బాధతో అరుస్తుంటే చూసి పైశాచిక ఆనందాన్ని పొందే శాడిస్టు అని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. షఫీనే భగవత్ సింగ్‌కు , అతని భార్య లైలాకు మాయ మాటలు చెప్పి వారిచేత ఈ దురాగతాలు చేయించాడని తెలుస్తోంది. 75 సంవత్సరాల వృద్ధురాలిని లైంగికంగా హింసించి హత్యచేసిన ఘటనలో 2020లో ఒక కేసులో ఈ షఫీ నిందితుడని బెయిల్‌పై బయటకు వచ్చాడని విచారణలో తెలింది. అశ్లీల నీలిచిత్రాలలో నటించేందుకు బాధితులను ఒప్పించి, వారికి డబ్బు ఇస్తామని హామీ ఇచ్చారని మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకువచ్చారని తెలుస్తోంది. అలాగే అదే సమయంలో భగవల్ సింగ్, లైలాలకు వారి ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోవాలంటే నరబలి ఇవ్వాల్సి ఉంటుందని నమ్మించాడని పోలీసులు తెలిపారు. బాధితులను పైశాచికంగా హింసించి రక్తం పారేలా చేశారు. అనంతరం వీరు నరమాంస భక్షకుల వలే వారి మాంసాన్ని ఆరగించారని, కొన్ని భాగాలను మూడు గుంతలలో పూడ్చి పెట్టారని తెలిసింది. ఆ గుంటలలో వారి శరీర భాగాలు కొన్ని లభ్యమయ్యాయి.

ఈ భగవల్ సింగ్ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీలింగ్ థెరఫిస్ట్. కేరళలో అధికారంలో ఉన్న సీపీఎం పార్టీతో సంబంధాలున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ తిరస్కరించింది. అతను మాతో పని చేస్తాడు కానీ పార్టీ సభ్యుడు కాదని, ఒకప్పుడు అభ్యుదయ భావాలు గల వ్యక్తి అనీ, కానీ ఇప్పుడు రెండో వివాహం చేసుకుని, మతపరమైన వ్యక్తి అయ్యాడని, అప్పటి నుండి పార్టీ కార్యకలాపాలలో పాల్గొనడం లేదని అతని భార్య ప్రభావం వలన కావచ్చునంటూ సీపీఐ పీఆర్ ప్రదీప్ అన్నారు. ఈ ఉదంతంపై కేరళ ముఖ్యమంత్రి విజయన్ స్పందిస్తూ ఈ కేసుపై త్వరగా విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఇలాంటి మూఢనమ్మకాలు, ఆచారాలు మానవ నాగరిక సమాజానికి సవాళ్లుగా పరిణమిస్తాయని పేర్కొన్నారు.


 
							 
							