NationalNewsNews Alert

కమనీయం ఈ రాధామాధవీయం

ఆ వైకుంఠనాధుడు మనిషిగా అవతరించి ఆదర్శ మానవజీవితం ఎలా ఉండాలో చూపించిన అవతారం శ్రీరామావతారం అయితే భగవద్గీతా సారాన్ని ప్రపంచానికి అందించి సంపూర్ణ మానవునిగా జీవించి తన లీలలను ప్రదర్శించి జగన్నాటక సూత్రధారిగా మహాభారతయుద్ధాన్ని నడిపించిన సారధి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే. అయితే చిన్నికృష్ణుడంటే మనందరికీ ఎంతో ముద్దు. మన ఇంట్లో బుజ్జి పాపాయిలా కృష్ణలీలలను వింటూ, చదువుతూ, చూస్తూ ఆనందిస్తూ ఉంటాము. కృష్ణునిపై ప్రేమతో ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా పిలుచుకుంటారు. గోకులంలో నందగోపాలునిగా, బృందావనంలో రాధామాధవునిగా, మథురలో కంసమర్థనుడిగా, కురుక్షేత్రంలో గీతాచార్యునిగా నవరసాలొలికించే నల్లనయ్య మన కన్నయ్య. అయితే ఎన్ని పేర్లతో పిలిచినా కృష్ణప్రేమ అంటే మనకు రాధామాధవులే గుర్తుకొస్తారు. ఈ కృష్ణాష్టమి సందర్భంగా మనం రాధామాధవప్రేమను తలచుకుందాం.

మహా భారతంలో మనకు రాధ ప్రస్తావన కనిపించదు కానీ చిన్ని కృష్ణుని గాధలలో ఆమె ముఖ్య పాత్రలో ఉంటుంది. యశోధాకృష్ణుని తరవాత రాధా కృష్ణునిగానే మనం కృష్ణున్ని గుర్తిస్తాము. రాధాకృష్ణులను విడివిడిగా చూడలేము. రాధ ఎక్కడుంటే కృష్ణుడు అక్కడున్నట్లే. కృష్ణుడుకి అష్టభార్యలు ఉన్నా, పదహారువేలమంది గోపికలు చుట్టూ ఉన్నా ఆయన ప్రేమసామ్రాజ్ఞి రాధారాణియే. కృష్ణుని ప్రేమ ఉంటే చాలు ఇంకేమీ అక్కరలేదు..అంటూ ఉంటారు ఆయన ప్రియసఖులు. కృష్ణుని వేణునాదంతో మైమరిచి నాట్యాలు చేస్తూ ఉంటారు. కృష్ణమంత్రమే జీవిత పరమార్థంగా ఆయన దివ్యమంగళరూపాన్ని ధ్యానిస్తూ నల్లనయ్య ఆరాధనలో అమరత్వం పొందింది రాధ. కృష్ణునిపై అలిగినా, ముద్దుగా ఆయనను కోప్పడినా అదంతా కృష్ణుని విడిచి ఉండలేని బాధతోనే తప్ప కోపం కాదు రాధమ్మకి. వారి అమరప్రేమకి బృందావనం నందనవనమై నాట్యం చేసేది. ఆయన మురళీగానమే ఆమెకు ప్రాణవాయువు. ఆమె గజ్జెల సవ్వడే ఆయనకు ప్రేమామృతం. ఆ రాధాకృష్ణుల ప్రేమకి ప్రకృతే పులకించి నెమళ్లు పురివిప్పి నాట్యమాడేవి.

అపరిమితమైన ప్రేమభావన మితిమీరి, సునామీలా ముంచెత్తితే అది పరిమితులు దాటిన భక్తికి దారితీస్తుంది. రాధ విషయంలో అదే జరిగింది. ప్రేమ, భక్తి మార్గాలలో కృష్ణ సాన్నిత్యాన్ని అతిగా ఆస్వాదించిన రాధమ్మ బృందావనానికే పట్టపురాణిగా విలసిల్లింది. కృష్ణుడు బృందావనాన్ని వదిలి వెళ్లినా ఆమె మనసంతా ఆ మధుసూదనుడే. ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్లినా ఆమెకు అచ్యుత నామస్మరణమే. అంత ప్రేమమూర్తి కాబట్టే ఆమెకు ఈ సమస్త విశ్వంలోనే అన్నిలోకాలలో అత్యున్నతమైన కృష్ణలోకంలో చోటు దొరకడమే కాదు. ఆమెనే ఆ లోకపు ఏలికగా నిలిచింది.