హనీట్రాప్‌లో పడి పాక్‌కు భారత రక్షణ రహస్యాలు..
పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కోసం పనిచేస్తున్న ఒక అమ్మాయికి భారత రక్షణ రహస్యాలు చేరవేస్తున్నాడనే ఆరోపణతో యూపీలోని వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నేహా శర్మ అనే పేరుతో యూపీకి చెందిన రవీంద్ర కుమార్ అనే వ్యక్తిని హనీట్రాప్‌లో పడేసి, అతడి నుండి భారత రక్షణ రహస్యాలు రాబట్టింది. ఇతడు ఫిరోజాబాద్‌లో హజ్రత్‌పుర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గతేడాది అతడికి ఆమె ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యింది. డబ్బు కూడా ఆశ చూపి, వలపు వల విసిరింది. ఆమెకు వాట్సాప్‌లో పలు కీలక పత్రాలు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, 51 గోర్ఖా రైఫిల్స్ రెజిమెంట్ అధికారులు నిర్వహించిన డ్రోన్ పరీక్షలు, స్క్రీనింగ్ కమిటీ రహస్య లేఖలు వంటివి సంపాదించి వాటిని ఆమెకు పంపించాడు. దీనిలో గగన్‌యాన్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమెతోనే కాకుండా పాక్‌కు చెందిన ఐఎస్‌ఐ సభ్యులతో కూడా అతడు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

