ఇండియా పేరులోనే పవర్ ఉంది-ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
భారతదేశంలో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయని, కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోలేదని ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణ మూర్తి విచారం వ్యక్తం చేశారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ – అహ్మదాబాద్ IIMAలో యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులతో ఇంటరాక్షన్ సందర్భంగా, మూర్తి అనేక అంశాలపై తన మనసులోమాట బయటపెట్టారు. భారతదేశాన్ని ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాకు తగిన పోటీదారుగా నేటి యువతరమే మార్చాల్సి ఉందన్నారు.

లండన్‌లోని HSBC బోర్డులో 2008-2012 మధ్య కాలంలో తాను పనిచేస్తున్న సమయంలో… చైనా గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు… ఇండియా పేరు కూడా వచ్చేదని… కానీ చైనా పేరులా మాత్రం కాదన్నారు. దురదృష్టవశాత్తూ ఆ తర్వాత ఇండియా మాత్రం ముందుకు కదలలేకపోయిందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక అసాధారణ వ్యక్తి అని… ఆయన పట్ల విపరీతమైన గౌరవం ఉందన్న మూర్తి… యూపీఏ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ స్తబ్దుగా ఉండిపోయిందన్నారు. మన్మోహన్ సర్కారు నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యంతో ఇండియా ముందుకు కదల్లేకపోయిందన్నారు. నాడు ప్రతి విషయంలోనూ అందరూ చైనా పేరు చెప్పేవారని… ఇండియా ప్రస్తావన రాకపోవడం విచారకరమన్నారు. ప్రజలు ఏ దేశం గురించి మాట్లాడుతున్నప్పుడైనా సరే ఇండియా పేరు ప్రముఖంగా ప్రస్తావించాలన్నారు. ముఖ్యంగా చైనా పేరును ప్రస్తావించినప్పుడల్లా భారతదేశం పేరును ప్రస్తావించడం నేటి యువత బాధ్యత అన్నారు మూర్తి. నేటి యువత తప్పుకుండా ఈ విషయాన్ని పాటించాలన్నారు.

గతంలో యూరప్ దేశాలు భారతీయులంటే చిన్నచూపు చూసేవని… కానీ నేడు, దేశం పట్ల గౌరవం పెరిగిందన్నారు. ఇండియా ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ఇన్ఫోసిస్ మాజీ ఛైర్మన్ అన్నారు. 1991లో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్టార్టప్ ఇండియా’ వంటి పథకాలు దేశం అభివృద్ధి చెందేందుకు దోహదపడుతున్నాయన్నారు. ప్రస్తుతం మీరున్న వయసులో నేనున్నప్పుడు పెద్దగా తనపైన గానీ, ఇండియాపైనా గానీ పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏవీ లేవని… ఇప్పుడు భారీ అంచనాలున్నాయని… అందుకే కొత్త టార్గెట్లు రీచ్ కావాలన్నారు. ప్రస్తుతం పరిస్థితులు గతంలోలా లేవని… భారతదేశాన్ని చైనాకు తగిన పోటీదారుగా చేయగలదన్న విశ్వాసాన్ని యువత అందిస్తోందన్నారు.

కేవలం 44 ఏళ్లలో భారత్‌ను చైనా భారీ తేడాతో వెనక్కి నెట్టిందన్నారు. చైనా నమ్మశక్యం కాని రీతిలో దూసుకుపోతుందని… చైనా ఆర్థిక వ్యవస్థ… భారతదేశం కంటే 6 రెట్లు పెద్దదిగా ఎదిగిందన్నారు. 44 ఏళ్లలో 1978- 2022 మధ్య, చైనా… భారతదేశం కంటే చాలా వెనుకబడి ఉందన్న ఆయన తర్వాత వేగంగా దూసుకుపోయిందన్నారు. ఇండియా కంటే ఆరు రెట్లు ఎక్కువ అన్నది ఎంత మాత్రం జోక్ కాదన్నారు. ప్రస్తుతం ఇండియా… చైనా తరహాలో సమానమైన గౌరవాన్ని పొందాల్సి ఉందన్నారు నారాయమణ మూర్తి.
