Home Page SliderNational

ప్రధాని మోదీకి ఇండియా ఎంతో.. నాకు అంతే… జమియత్ చీఫ్ మదానీ

హిందీ ముస్లింలకు ప్రపంచంలోనే భారతదేశం ఉత్తమం
బలవంతపు మత మార్పిడులకు జమియత్ ఉలమా-ఇ-హింద్ వ్యతిరేకం
స్వచ్ఛందంగా మతం మారుతున్న వారిపై తప్పుడు కేసులొద్దు
ఢిల్లీ రామ్‌లీలా మైదనంలో 34వ జమియాత్ మూడు రోజుల ప్లీనరీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ లానే… ఇండియా తనకు కూడా సొంతమన్నారు జమియత్ ఉలమా-ఇ-హింద్ అధ్యక్షుడు మహమూద్ మదానీ. దేశ రాజధాని రాంలీలా మైదాన్‌లో జమియత్ ఉలామా-ఇ-హింద్ ప్రారంభోత్సవ ప్లీనరీ సమావేశంలో మౌలానా మదానీ మాట్లాడుతూ, ” భారతదేశం మనది. ఈ దేశం నరేంద్ర మోడీ, మోహన్ భగవత్‌లకు చెందినట్టుగానే… మహమూద్ మదానీకి కూడా చెందినది. మహమూద్ వారి కంటే ఒక అంగుళం కూడా ముందుండరు…. అలాగే వారు కూడా మహమూద్ కంటే ఒక్క అంగుళం కూడా ముందుండరు.” అన్నారు.

ఇండియాలో ఇస్లాం మతం అతి ప్రాచీనమైనదని అన్నారు. “ఈ భూమి ముస్లింల మొదటి మాతృభూమి. ఇస్లాం బయటి నుండి వచ్చిన మతం అని చెప్పడం పూర్తిగా తప్పు, నిరాధారం. ఇస్లాం అన్ని మతాలలో పురాతన మతం. హిందీ ముస్లింలకు భారతదేశం ఉత్తమ దేశం” అని మదానీ అన్నారు. బలవంతపు మత మార్పిడులకు తాము వ్యతిరేకమని, స్వచ్ఛందంగా మతం మారుతున్న వారిని కూడా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని జమియత్ ఉలమా-ఇ-హింద్ చీఫ్ ఆరోపించారు. బలవంతంగా నడపబడే మత మార్పిడికి వ్యతిరేకమన్న ఆయన… మతస్వేచ్ఛ ప్రాథమిక హక్కు అన్నారు. బలవంతంగా, మోసం, దురాశతో మత మార్పిడికి అంగీకరించబోమన్నారు. కొన్ని సంస్థలు ముస్లిం కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుంటున్నాయన్నారు మదానీ. నమాజ్‌పై నిషేధం, పోలీసు చర్య, బుల్డోజర్ చర్య అందులో భాగమన్నారు.

జమియత్ ఉలమా-ఇ-హింద్ మూడు రోజుల ప్లీనరీ సమావేశం శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైంది. యూనిఫాం సివిల్ కోడ్, మత స్వేచ్ఛ, ముస్లిం వ్యక్తిగత చట్టం, మదర్సాల స్వయంప్రతిపత్తి వంటి అంశాలు జమియత్ ఉలామా-ఇ-హింద్ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశాల్లో సామాజిక-ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనను తీసుకురావచ్చు. జమియాత్ 34వ సెషన్‌లో మత సౌభ్రాతృత్వాన్ని బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలు, విద్వేష ప్రచారాలను నిరోధించే కార్యక్రమాలు కూడా ఎజెండాలో భాగంగా ఉన్నాయి. జమియత్ ఉలమా-ఇ-హింద్ అనేది శతాబ్దాల నాటి సంస్థ. ముస్లింల పౌర, మత, సాంస్కృతిక, విద్యా హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తుంది. జమియాత్ ముస్లింల అతిపెద్ద సంస్థ. ముస్లింల సామాజిక-రాజకీయ, మతపరమైన అంశాలు సంస్థ ఎజెండాలో భాగం. జమియత్ ఇస్లాం, దియోబంది భావజాలాన్ని విశ్వసిస్తుంది.