ముగ్గురూ సీరియస్ `ఫైట్`
మునుగోడు.. మునుగోడు.. తెలంగాణాలో రాజకీయాలపై కనీస అవగాహన ఉన్న ఎవరి నోట విన్నా ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. ఇంకా షెడ్యూల్ కూడా ప్రకటించని ఉప ఎన్నికలో మునుగోడులో జెండా పాతేందుకు రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అన్ని శక్తియుక్తులనూ కేంద్రీకరిస్తున్నాయి. మూడు పార్టీల అగ్రనేతలంతా మునుగోడు బాట పడుతున్నారు. శనివారం సీఎం కేసీఆర్ మునుగోడులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఉప ఎన్నిక సైరన్‌ను మోగించేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం అక్కడే భారీ సభను నిర్వహించి టీఆర్‌ఎస్‌కు దీటైన జవాబివ్వాలని కంకణం కట్టుకున్నారు. ఇక `మన మునుగోడు – మన కాంగ్రెస్` నినాదంతో పార్టీ జెండావిష్కరణ కార్యక్రమానికి శనివారం శ్రీకారం చుట్టేందుకు రేవంత్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు.

3 లక్షల మందితో కేసీఆర్ భారీ సభ.. అభ్యర్థి ప్రకటన
శనివారం నాటి బహిరంగ సభకు కనీసం 3 లక్షల మందికి పైగా జనాన్ని సమీకరించాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. సభను సక్సెస్ చేసే బాధ్యతను జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి భుజాన వేసుకున్నారు. జన సమీకరణ బాధ్యతను మునుగోడు చుట్టుపక్కల గల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఇక ఈ సభలో సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటిస్తారని వార్తలొస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టికెట్ రేసులో ముందున్నారు. అయితే.. ఆయన అభ్యర్థిత్వంపై కార్యకర్తల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి ఆధ్వరంలో 200 మంది టీఆర్‌ఎస్ స్థానిక నాయకులు సమావేశమై కూసుకుంట్లకు వ్యతిరేకంగా పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. తర్వాత తాడూరీ బీజేపీలో చేరారు. దీంతో ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్ పేరు తెరపైకి వచ్చింది. సీఎం కేసీఆర్ శనివారం నిర్వహించే సభా ప్రాంగణంలోనూ, మునుగోడు నియోజకవర్గంలోనూ కర్నె ప్రభాకర్ ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు వెలిశాయి. నియోజకవర్గంలో బీసీల ఓట్లు ఎక్కువగా ఉండటం వల్ల కేసీఆర్ సభాముఖంగా కర్నె ప్రభాకర్ పేరును టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.

21న అమిత్ షా సభ.. బీజేపీలోకి రాజగోపాల్
మరోవైపు ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. అదే వేదిక పైనుంచి రాజగోపాల్‌ను బీజేపీ అభ్యర్థిగా అమిత్ షా ప్రకటిస్తారు. ఈ సభకు బీజేపీ శ్రేణులు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకొని.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు సవాల్ విసరాలని బీజేపీ నాయకులు పట్టుదలతో ఉన్నారు. ఈ ఎన్నికలను ఈటల రాజేందర్ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. తనపై కక్ష కట్టిన కేసీఆర్‌ను మట్టికరిపించి.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను గద్దె దించాలని కంకణం కట్టుకున్న ఈటల ప్రతిష్ఠ బీజేపీ అగ్ర నాయకుల్లో మునుగోడు విజయంతో పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మన మునుగోడు – మన కాంగ్రెస్
కాంగ్రెస్ కూడా సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. ముఖ్యంగా రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. మునుగోడు విజయాన్ని సోనియా, రాహుల్‌కు బహుమతిగా ఇవ్వాలని, తద్వారా విమర్శకుల నోరు మూయించాలని ఆశిస్తున్నారు. అందుకే రేవంత్ స్వయంగా మునుగోడు బరిలోకి దిగారు. శనివారం నుంచి నియోజకవర్గంలోని 7 మండలాలు, 176 గ్రామాల్లో కాంగ్రెస్ జెండా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆయన రంగంలోకి దిగారు. `మన మునుగోడు – మన కాంగ్రెస్` పేరుతో అందరికీ స్టిక్కర్లు పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం పాల్వాయి స్రవంతి, చల్లా కృష్ణారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగినందున కాంగ్రెస్ కూడా త్వరలోనే అభ్యర్థిపై ఓ నిర్ణయానికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

