నేనింకా చావలేదు… కన్నీళ్లు పెట్టుకున్న సమంత
ప్రముఖ సినీ నటి సమంత కొంత కాలంగా మయోసైటిస్ అనే కండరాల వ్యాధితో బాధపడుతున్నారు. ఈనెల 11న ఆమె నటించిన యశోద సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సమంత యశోద సినిమా ప్రమోషన్స్‌లోనూ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ వ్యాధిని జియస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలో మయోసైటిస్ వ్యాధిని చాలా మంది సమర్థవంతంగా ఎదుర్కొన్నారని చెప్పారు. తాను కూడా దీన్ని ఎదుర్కొంటానని ఆత్మ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురైన ఆమె కంట తడి పెట్టుకున్నారు. త్వరలోనే దీన్నుంచి బయటపడతానని అన్నారు.
ఒకానొక సమయంలో తాను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనని అనిపించింది. ఇప్పుడు ఆలోచిస్తే ఇక్కడి వరకు ఎలా వచ్చానోనని అనిపిస్తుంది అంటూ ఆమె భావోద్వేగానికి లోనైంది. తన అనారోగ్యం కూడా కొందరు తప్పుగా ప్రచారం చేస్తూ తాను ప్రాణపాయ స్థితిలో ఉన్నట్లు వార్తలు రాశారని, కానీ తాను ఇప్పటికి ఇంకా చావలేదు అంటూ ఎమోషనల్ అయ్యారు. అందరి జీవితాల్లో మంచి రోజులు, చెడు రోజులు ఉంటాయని సమంత తెలిపారు.