NewsTelangana

దమ్ముంటే పోటీ చెయ్‌… కుల అహంకారంతో దాడి

కుల అహంకారంతో తన ఇంటిపై దాడి చేశారని నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ చెప్పారు. నిజామాబాద్‌లో ఉన్న ఎంపీ మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే తనపై వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కవితకు ఆయన సవాల్‌ విసిరారు. ఇంకా దొరలపాలన సాగుతుందని అనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. తన ఇంటిపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడిచేసి మహిళలను భయపెట్టారన్నారు. తన తల్లిని బెదిరించారని ఎంపీ అరవింద్‌ ఆరోపించారు. ఒక ఎంపీ ఇంటిపై దాడి జరుగుతుంటే రక్షణ కల్పించకుండా డీజీపీ ఏం చేస్తున్నారని నిలదీశారు ఎంపీ. గతంలో కూడా ఎంపీలపై దాడులు జరిగాయని.. తనపై దాడి జరగడం కొత్తేంకాదని చెప్పారు. తనపై చీటింగ్‌ కేసు ఏం వేస్తావని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో మాట్లాడినట్టుగా తనకు ఏఐసీసీ సెక్రటరీ ఫోన్‌ చేసి చెప్పారన్నారు. అదే విషయాన్ని తాను మీడియాలో ప్రస్తావించానని అన్నారు. ఈ వ్యాఖ్యలో తప్పేం ఉందో చెప్పాలన్నారు. కవిత ఇంత రియాక్ట్‌ అవుతుంటే ఈ ప్రచారంలో వాస్తవం ఉందనిపిస్తుందన్నారు. కాంగ్రెస్‌ కీలక నేతలతో కవిత మాట్లాడిన ఫోన్‌ కాల్‌ నిజమో కాదో తేలాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రోజు పక్కన కూర్చున్న ఎమ్మెల్యేలే ఆమెను ఓడగొట్టారని గుర్తు చేశారు. గెలుస్తానని నమ్మకం ఉంటే పోటీకి రావాలని కవితకు సవాల్‌ విసిరారు. రెండోసారి కూడా ఎంపీగా గెలుస్తానని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు.