అంగన్‌వాడీలు సమ్మె విరమించకపోతే వేరొకరిని చూసుకుంటాం..బొత్స
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం అంగన్‌వాడీల నాయకులతో అనుబంధ సంఘాల నేతలతో మంత్రుల బృందం చర్చలు జరిపింది. మంత్రి బొత్స సత్యనారాయణ అంగన్‌వాడీలు సమ్మెలు విరమించకపోతే వేరొకరిని చూసుకుంటాం అని హెచ్చరించినట్లు సంఘాల నాయకులు పేర్కొన్నారు. వీరి చర్చలు విఫలం అయ్యాయి. దీనితో సమ్మె ఉద్ధృతం చేస్తామని వారు ప్రకటించారు. వారి ప్రధాన డిమాండ్లైన వేతనాల పెంపు, గ్రాట్యుటీలపై అంగీకారం కుదరలేదు. ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలుపుతూ నేడు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి సంఘాల నేతలు పిలుపు నిచ్చారు. అక్కడికీ దిగిరాకపోతే జనవరి 3న కలెక్టరేట్లను ముట్టడిస్తామని తేల్చి చెప్పారు. సమ్మె విరమించకపోతే జనవరిలో పోషకాహార కిట్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటామని ప్రభుత్వం చెప్తోంది. గ్రాట్లుటీ అమలు తమ చేతుల్లో లేదంటూ తప్పించుకుంటున్నారని వీరు విమర్శిస్తున్నారు.