accidentBreaking NewsHome Page Sliderhome page sliderNationalNewsPoliticsviral

కస్టమర్లకు షాకిస్తున్న ఐసీఐసీఐ బ్యాంక్

  • మినిమమ్ బ్యాలెన్స్ అమాంతం పెంచేసిన ఐసీఐసీఐ
  • ఏకంగా ఐదు రెట్లు పెంపు
  • ఖాతాలో రూ.50 వేలు ఉండాల్సిందే
  • లబోదిబోమంటున్న కస్టమర్లు
  • ఇటీవల కనీస మొత్తానికి అపరాధ రుసం తొలగించిన ప్రభుత్వ రంగ బ్యాంకులు

ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ కస్టమర్లకు షాకిచ్చింది. పొదుపు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ లేనిపక్షంలో విధిస్తున్న అపరాధ రుసుమును ఇటీవల కొన్ని బ్యాంకులు ఎత్తివేస్తున్న సంగతి తెలిసిందే. ఐసీఐసీఐ మాత్రం అందుకు భిన్నంగా సేవింగ్ అకౌంట్లలో కనీస సగటు నిల్వ (Minimum Average Balance) మొత్తాన్ని పెంచేసింది. మెట్రో, అర్బన్, సెమీ అర్బర్, గ్రామీణ బ్రాంచ్ ఖాతాదారులందరిపై ఈ పెంపు ప్రభావం ఉంటుందని ఐసీఐసీఐ (ICICI) బ్యాంకు తెలిపింది. ఈ నిబంధన ఆగస్టు 1, 2025 నుంచే వర్తిస్తుందని స్పష్టం చేసింది. మారిన నిబంధనల ప్రకారం.. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఐసీఐసీఐ సేవింగ్ అకౌంట్ ఉన్నవారు ఇకపై తమ సగటు నిల్వలను కనీసం రూ.50వేలు ఉంచాలి. గతంలో ఈ పరిమితి రూ.10వేల వరకు ఉండేది. ఇప్పుడు దాన్ని ఏకంగా ఐదు రెట్లు పెంచేసింది. ఇక, సెమీ అర్బన్ కస్టమర్ల కనీస సగటు నిల్వ మొత్తాన్ని రూ.5 వేల నుంచి రూ.25వేలకు పెంచింది. గ్రామీణ ఖాతాదారులకు రూ.2,500 నుంచి రూ.10వేలకు పెంచేసింది. ఖాతాదారులు ఎప్పటికప్పుడు తమ నిల్వలను సరిచూసుకోవాలని, కొత్త నిబంధనల ప్రకారం మినిమమ్ బ్యాలెన్స్ లేనిపక్షంలో ఛార్జీలు కట్టాల్సి ఉంటుందని ఐసీఐసీఐ వెల్లడించింది. ప్రస్తుతం దేశీయ బ్యాంకులు పొదుపు ఖాతాలపై అనుసరిస్తున్న కనీస సగటు నిల్వ మొత్తం నిబంధనల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని అతి పెద్ద బ్యాంక్ ఎస్ బీఐ తమ ఖాతాదారులకు 2020లోనే ఈ అపరాధ రుసుమును ఎత్తివేసింది. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడ్, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంకులు కూడా ఇలాంటి ఛార్జీలను తొలగించాయి. అయితే ప్రైవేట్ బ్యాంకులు ఈ ఛార్జీలను అమలు చేస్తున్నాయి. హెచ్ డీ ఎఫ్ సీలో గరిష్ఠంగా రూ.10వేల కనీస నగదు నిబంధనను (మెట్రో/అర్బన్ నగరాల్లో) అమలుచేస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్ లో అయితే ఈ మొత్తం రూ.12వేలు (మెట్రో/అర్బన్) గా ఉంది. మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే ఆయా కస్టమర్ల నుంచి బ్యాంకులు కొంత మొత్తంలో ఛార్జీలు వసూలుచేస్తున్న సంగతి తెలిసిందే.

Breaking news:ఏపీపీఎస్సీలో ఈ పోస్టులన్నింటికీ ఒకే పరీక్ష