30 ఏళ్ల ఐఏఎస్ కెరీర్‌లో..56 సార్లు బదిలీ
అశేక్ ఖేమ్కా దేశంలోనే అనేక సార్లు బదిలీ అయిన ఐఏఎస్ అధికారిగా పేరుగాంచారు. ప్రస్తుతం ఆయన హరియాణా సైన్స్ అండ్ టెక్నాలజీ అదనపు ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన తాజాగా మరోసారి బదిలీ అయ్యారు. కాగా ఆయనను ఆదే హోదాతో ప్రభుత్వ ప్రాచీన పత్ర భాండాగార (ఆర్కైవ్స్) శాఖకు బదిలీ చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే అశోక్ ఖేమ్కా 30 ఏళ్ల ఐఏఎస్ కెరీర్‌లో.. ఇది ఆయనకు 56వ బదిలీగా తెలుస్తోంది. బదిలీకి గల కారణాన్ని మాత్రం ప్రభుత్వం అధికారిక ఉత్తర్వుల్లో ప్రస్తావించలేదు. అయితే ఈ బదిలీ కోసం అశోక్ ఖేమ్కా స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కొన్ని రోజుల క్రితం లేఖ రాసినట్లు సమాచారం. ప్రస్తుతం తాను విధులు నిర్వహిస్తున్న శాఖను, ఉన్నత విద్యా శాఖలో విలీనం చేయడంతో తనకు పని లేకుండా పోయిందని అశోక్ ఖేమ్కా ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా తన స్థాయి అధికారికి వారానికి కనీసం 40 గంటలు పని ఉంటే బాగుంటుందని ఆయన సీఎస్‌కు తెలిపారు. అశోక్ ఖేమ్కా తన ఐఏఎస్ కెరీర్‌లో ఎక్కువసార్లు ప్రాధాన్యత లేని పోస్టుల్లోనే కొనసాగారు. కాగా ఆయన 4వ సారి ఆర్కైవ్స్ శాఖలో విధులు నిర్వర్తించనున్నారు.


 
							 
							