లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నా దగ్గర డబ్బుల్లేవ్ : నిర్మలా సీతారామన్
ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు.. సాక్షాత్తూ దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశానికి ఆర్థిక మంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఏకైక నాయకురాలు ఈమె కావొచ్చేమో… లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తగిన మొత్తం తన వద్ద లేదంటూ ఆమె బాంబు పేల్చారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న బీజేపీ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తనకు ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారని ఆమె తెలిపారు.

‘‘వారం, పది రోజులు ఆలోచించి ‘కాకపోవచ్చు’ అని వెనక్కి వెళ్లాను.. పోటీ చేసేందుకు నా దగ్గర అంత డబ్బు లేదు.. ఆంధ్రప్రదేశ్ అయినా.. తమిళనాడు అయినా.. అది కూడా సమస్యే. వారు ఉపయోగించే గెలుపు ప్రమాణాలకు సంబంధించినవి టఫ్ గా ఉంటాయి. మీరు ఆ కమ్యూనిటీకి చెందినవారా లేదా మీరు ఈ మతానికి చెందినవారా? మీరు దీనికి చెందినవారా? అంటూ ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. అందుకే నేను వద్దు అనుకున్నా.. నేను ఎన్నికల్లో పోరాడలేను అని అనుకున్నా.. ” ఆమె టైమ్స్ నౌ సమ్మిట్ 2024లో చెప్పారు.”వారు నా వాదనను అంగీకరించినందుకు నేను చాలా కృతజ్ఞురాలిని. కాబట్టి నేను పోటీ చేయడం లేదు” అని ఆమె చెప్పారు. ఎన్నికలలో పోరాడేందుకు దేశ ఆర్థిక మంత్రి వద్ద తగినంత నిధులు ఎందుకు లేవని అడిగినప్పుడు, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా తనకు చెందదని ఆమె అన్నారు. “నా జీతం, నా సంపాదన, నా పొదుపు నావి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నాది కాదు”. అని ఆమె చెప్పారు.

ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే లోక్‌సభ ఎన్నికలలో అధికార BJP ఇప్పటికే పలువురు రాజ్యసభ సభ్యులను పోటీకి దింపింది. వీరిలో పీయూష్ గోయల్, భూపేందర్ యాదవ్, రాజీవ్ చంద్రశేఖర్, మన్సుఖ్ మాండవియా, జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యురాలు. ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ.. ఇతర అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తానని మంత్రి తెలిపారు. “నేను చాలా మీడియా కార్యక్రమాలకు హాజరవుతాను మరియు అభ్యర్థులతో వెళతాను – రేపు నేను రాజీవ్ చంద్రశేఖర్ ప్రచారానికి వెళతాను. ప్రచారం పూర్తిగా నిర్వహిస్తాను” అని ఆమె చెప్పారు.