హుజూరాబాద్ కీర్తి పతాక మరోసారి ఎగరాలి: ఈటల సమరనినాదం
నాకొడుకు ఎవరో మీకు తెలుసా ? నా బిడ్డ ఎవరో మీకు తెలుసా ?
నేను ప్రజలకోసం నిబద్దతతో పని చేస్తున్నా.. కుటుంబం కోసం కాదు.
మీకు ఓట్లు వేసి మళ్లీ మీ గడిల ముందు చెప్పులు పట్టుకుని పోవాలా?
కొంగుచాపితే, డాన్సులు వేస్తే, ప్లీజ్ ప్లీజ్ అని అడిగితే ప్రజలు ఓట్లు వేస్తారా?
ఊహ తెలిసినప్పటి నుండి హుజూరాబాద్‌లో కాంగ్రెస్ గెలవలేదు-ఈటల
భారతీయ జనతా పార్టీ హుజూరాబాద్ అభ్యర్థిగా, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ వెంట రాగా.. ఈటల నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ తర్వాత ఆర్డీవో కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమైనవో.. ఈటల స్థానికులకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో గెలవడం ద్వారా దేశ చరిత్రలో హుజూరాబాద్ స్థానం మారిపోతుందన్నారు. తనపై కొట్లడుతున్నవారిపై ఈటల విరుచుకుపడ్డారు. ఒకడు వ్యాపారం చేసిన పైసలు, ఇంకొకడు దోచుకున్న పైసలు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెడుతున్నారన్నారు. కాళేశ్వరం నుంచి తీసుకొస్తున్న పైసలు పంచి పెడుతున్నారు. కులసంఘాల భవనాలకు పైసలు ఇస్తే తీసుకోండి. పెద్దమ్మగుళ్ళకు, ఎల్లమ్మగుళ్ళకు, పోచమ్మగుళ్ళకు, బీరన్న గుళ్ళకు పైసలిస్తే తీసుకోవాలన్నారు ఈటల. రోడ్లకి ఇచ్చిన ప్రొసీడింగ్ అన్నీ అమలు చేయాలని గల్లా పట్టుకుని అడగాలన్నారు. తెలంగాణజాతి ఆత్మను అమ్ముకోదు, ఆత్మగౌరవంతో బతికే జాతి అన్నారు ఈటల.

ఓటు అడుక్కునేది కాదు, కొనుక్కునేది కాదు, అరిగిపోయేది కాదు, కరిగిపోయేది కాదు. ఎన్నిసార్లు అయినా వేయవచ్చునన్నారు ఈటల రాజేందర్. నాకు ఏడుసార్లు వేశారు. 2008లో, 2010లో.. రెండుసార్లు తెలంగాణ ఆత్మగౌరవ బావుట కోసం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిపించారు. బీసీఆర్ బీ ఫారం ఇచ్చినా పట్టుమని పది సీట్లు గెలవని విషయం మర్చిపోయారా ? రాజేందర్ వేలవేల తల్లుల ప్రేమతో పెరిగినవాడు. ఆకలిని దుఃఖాన్ని చవిచూసిన బిడ్డ. ఈ 20 ఏళ్లలో ఎవరి దగ్గరైన నేను డబ్బులు తీసుకొన్నా అని నిరూపించగలరా? సఫాయి కార్మికులు కూడా నా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అన్నం తింటారు. ప్రతి ఒక్కరిలో నాకు మనిషి కనిపిస్తారు. హుజూరాబాద్ ప్రజల కాలిలో ముళ్ళు కుచ్చుకుంటే పంటితో తీసేలా పనిచేశా. మచ్చ తేకుండా పని చేశా. ఎక్కడికి పోయినా మీకు గౌరవం తెచ్చిన బిడ్డను నేను. హుజూరాబాద్ పేరు చెపితే మంచినీళ్ళు పుట్టేలా గౌరవం తీసుకువచ్చానన్నారు ఈటల రాజేందర్.

నేను మనిషి చిన్నగా ఉండొచ్చు.. నాకు గొంతు ఉందన్నారు ఈటల. నాకొడుకు ఎవరో మీకు తెలుసా ? నా బిడ్డ ఎవరో మీకు తెలుసా ? నేను ప్రజలకోసం నిబద్దతతో పని చేస్తున్నా.. కుటుంబం కోసం కాదు. మీ మీద ప్రేమలేక నేను గజ్వేల్ పోలేదు. నరకం చూపించిన కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు పోతున్నానన్నారు. భూలోకంలోనే నాకు కేసీఆర్ నరకం చూపిస్తే కాపాడుకున్న బిడ్డలు మీరని హుజూరాబాద్ ప్రజలకు ఈటల కృతజ్ఞతలు తెలిపారు. మీకు ఓట్లు వేసి మళ్లీ మీ గడిల ముందు చెప్పులు పట్టుకుని పోవాలా? మనుకోటలో మా మీద బుల్లెట్లు కురిపించిన, మా రక్తాన్ని కళ్ళ చూసిన.. జిప్పు తీసి చూపించిన వాడి పేరును అమరవీరుల స్థూపం మీద కొట్టించారు. మేము పెట్టిన స్థూపం తీసివేయించారన్నారు ఈటల. కొంగుంచాపితే, డాన్సులు వేస్తే, ప్లీజ్ ప్లీజ్ అని అడిగితే ప్రజలు ఓట్లు వేస్తారా. ప్రజలకు నచ్చాలి. సేవ చేయాలి.? అప్పుడే ఓటేస్తారన్నారు. హుజూరాబాద్‌లో నాతో ఉన్నవారిని స్టేషన్లో పెట్టి కొట్టి ఫోటోలు తీసి పంపే పోలీసులు పోవాలంటే కేసీఆర్ ఓడిపోవాలన్నారు. ప్రధాన మంత్రి ఒక మాట చెప్పారు. కేసీఆర్‌తో నువ్వు మాత్రమే కొట్లాడగలవు అని చెప్పారు. ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. 36 కులాల పెద్దలతో మోదీ మాట్లాడారన్నారు. రెండు శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయని రాహుల్ గాంధీ అంటారు. మా సత్తా ఏంటో చూపిస్తామన్నారు ఈటల.

నా కంటికి కేసీఆర్ దుర్మార్గం మాత్రమే కనిపిస్తుందన్నారు ఈటల. హుజూరాబాద్ ప్రజలారా ఇంటింటికీ వంద రూపాయలు ఇవ్వండి. చరిత్ర నిర్మాతలు నాయకులు కాదు ప్రజలు. ప్రాణబిక్ష పెట్టిన వాళ్ళు కూడా నన్ను ఓడగొట్టలని పని కట్టుకొని తిరుగుతున్నారట.. మీరేం మనుషులు. మానవత్వం లేదా? హుజూరాబాద్ కీర్తి ప్రతాక మరో సారి ఎగురబోతుంది. జమునమ్మను మీకు అప్పజెప్తున్నా… ఏ ఇంటికి ఆ ఇల్లు మీరే పోటీచేస్తున్నట్టు పని చేయండి. కేసీఆర్ నన్ను బయటికి పంపించి వీడి పని అయిపోయింది అనుకున్నాడు.. పని అయిపోయింది కెసిఆర్‌దని హుజూరాబాద్ ప్రజలు రుజువు చేశారు. ప్రధానిమంత్రి నన్ను పక్కన కూర్చోబెట్టుకొని బాధ్యత అప్పగించారు. ముఖ్యమంత్రి కావాలంటే ఒక్క దగ్గర గెలిస్తే సరిపోదు. తెలంగాణ అంతా తిరగాలి. ఒక్క దీపం వెయ్యి దీపాలు వెలిగించినట్లు మీరు పని చెయ్యాలి. ఆపద వస్తె మీకు అండగా ఉంటాను. ముఖ్యమంత్రి చేయాలంటే కసితో, కమిట్మెంట్ తో పని చేయండి. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇక్కడ కాంగ్రెస్ గెలవలేదన్నారు ఈటల. నిండు మనసుతో నన్ను ఆశీర్వదించి నన్ను ముందుకు నడిపించండి. మోదీ సంపూర్ణ అండ ఈటలపై ఉందన్నారు.

ఉపఎన్నికలో ఎంత కసిగా కేసీఆర్‌ను ఓడించాలని ప్రజలు ఉన్నారో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నారన్నారు ఈటల సతీమణి ఈటల జమున. ఈటల రాజేందర్ వెంట మేమంతా ఉన్నాం, మీరు బాధపడనవసరం లేదని ప్రజలందరూ చెబుతున్నారన్నారు. 2023 వరకు 7 సార్లు గెలిపించారు.. ఈటల రాజేందర్ మీ అన్న. 8వ సారి ఎన్నిక చాలా ముఖ్యమైన ఎన్నిక. తెలంగాణలో హుజూరాబాద్ నెంబర్ వన్ ఉండేలాగా ఆశీర్వదించాలని మీ అందరిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానన్నారు.

