Andhra PradeshHome Page Slider

ప్రకాశం జిల్లా వివాహిత హత్యకేసులో భర్తే కాలయముడు

ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడుకు చెందిన కోట రాధ అనే వివాహిత హత్యకేసులో విస్తుపోయే నిజాలు వెలికి వచ్చాయి. తన భార్య పేరిట ఉన్న 1.5 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఆమెను తానే కడతేర్చినట్లు ఆమె భర్త మోహన్ రెడ్డి అంగీకరించాడు. అత్యంత కిరాతకంగా హింసించి, రోడ్డుపై ఈడ్చి, కారు శరీరంపై ఎక్కించి వివాహితను హతమార్చిన ఈకేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాల్యస్నేహితుడైన కాశింరెడ్డికి 80 లక్షల రూపాయలు అప్పు ఇచ్చిన రాధను, అప్పు తీర్చమందనే కోపంతో కాశింరెడ్డే హత్య చేశాడని నమ్మకం కలిగేలా చేశాడు ఆమె భర్త మోహన్ రెడ్డి. ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ దిశలో కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆమె స్నేహితుడు కాశింరెడ్డి కోసం వెదకుతున్నారు. ఈ క్రమంలో విచారణ సమయంలో ఆమె భర్త మోహన్ రెడ్డి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. దీనితో అతని కదలికలపై నిఘా పెట్టిన పోలీసులకు అసలు విషయం అర్థమయ్యింది. కాశింరెడ్డికి ఇచ్చిన అప్పు విషయంలో గత కొన్ని రోజులుగా భార్యాభర్తలిద్దరిమధ్యా తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. దీనితో ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఆమె పేరుతో ఉన్న 1.5 కోట్ల రూపాయలు లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బు కూడా అతనికి ఆశ కలిగించింది. ఆమె చనిపోతే తనకు ఈ డబ్బు వస్తుందని ఊహించాడు.

హత్య జరిగిన సమయంలో హైదరాబాదులో ఉన్నానంటూ చెప్పిన మోహన్ రెడ్డి కనిగిరిలోనే ఉన్నాడని, గూగుల్ టేకౌట్ ద్వారా గుర్తించారు పోలీసులు. ఆపై అతడు కాశింరెడ్డి పేరుతో సిమ్ కార్డులు కొని, అతని పేరుతో రాధకు మొబైల్ సందేశాలు పంపాడని గ్రహించారు. వేరువేరు ప్రాంతాలలో ఇతరుల ఫోన్ల ద్వారా తన భార్య రాధతో చాటింగ్ చేశాడు. హత్య జరిగే ముందురోజు సూర్యాపేటలో ఒక చెరకు రసం బండి వ్యక్తి ఫోన్‌తో, పల్నాడు జిల్లా వినుకొండ వద్ద మరొకరి ఫోన్‌తో, కనిగిరి వద్ద బస్టాండులో వేచి ఉన్న మహిళ ఫోన్‌తో మొబైల్ సందేశాలు పంపాడు. వారందరితో తన సిమ్ కార్డు పని చేయడం లేదని చెప్పి వారి ఫోన్లలో కాశింరెడ్డి పేరుతో ఉన్న సిమ్ వేసి ఈ మెసేజ్‌లు పంపినట్లు గుర్తించారు పోలీసులు. దీనితో హంతకుడు ఎవరన్నది వారికి తేటతెల్లమయ్యింది. రాధ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు వేచి ఉండి, అనంతరం కోదాడలో మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అతడు నేరం అంగీకరించవలసి వచ్చింది. కానీ ఈ హత్యలో అతడికి మరికొందరు సహకరించారు. వారు ఎవరనే విషయం రాబట్టాల్సి ఉంది.