మావోయిస్టుల వద్ద భారీగా బంగారు నిల్వలు :పోలీసులకు షాక్
ఇంటర్నెట్ డెస్క్ : మావోయిస్టుల వద్ద భారీగా బంగారు నిల్వలు మూలుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే ఏకంగా 400 కిలోలు ఉన్నట్లు తేలడంతో పోలీసులు షాక్ తిన్నారు. మావోయిస్టు అగ్రనేతలు బంగారం రూపంలో, బినామీ ఖాతాలలో, బ్యాంక్ ఖాతాలలో ఈ సొమ్మును దాచుకుంటున్నారట. అంతేకాదు ఎక్కడ పెట్టాలో తెలియక అడవులలో భూగర్భంలో కూడా బంగారం, నగదు దాచినట్లు ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు నేతలు క్లూ ఇచ్చారు. మావోయిస్టులు తరచూ ఆయుధాల కోసం, వైద్యం కోసం పారిశ్రామిక వేత్తలు, రాజకీయనాయకులు, కాంట్రాక్టర్ల నుండి కోట్ల రూపాయలు సేకరించి దాచిపెడతారట. పైగా కరోనా సమయంలో భారీ ఎత్తున నిధులు సేకరించారని, వాటిని డొల్ల కంపెనీలలో పెట్టుబడులుగా చూపిస్తున్నారని తేలింది. ఇటీవల ఝార్ఘండ్ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకుడు దినేష్ గోపేను ఈడీ అధికారులు అరెస్టు చేయగా, అతని భార్య, బంధువుల పేర్లతో ఉన్న డొల్ల కంపెనీలు బయటపడ్డాయి. వాటిలో ఏకంగా రూ.20 కోట్లు దాచారు. తాజా సమాచారం ప్రకారం మావోయిస్టులు వందల కోట్లు వసూలు చేసి, అవసరానికి వాడుకుని మిగతాది బంగారం, డబ్బు రూపంలో ఉంచుతున్నారన్న విషయం వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

