హుస్సేన్ సాగర్ లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మహా హారతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు బాణసంచా పేల్చేందుకు తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ కు చెందిన రెండు బోట్లలో బాణ సంచా సామగ్రిని హుస్సేన్ సాగర్ మధ్యలోకి తీసుకెళ్లారు. టపాసులు పేలుస్తున్న క్రమంలో నిప్పు రవ్వలు తిరిగి అదే బోట్లపై పడ్డాయి. దాంతో బోట్లలో ఉన్న బాణసంచా పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో చాకచక్యంగా ఏడుగురు నీళ్ళలో దూకి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. వారిలో నలుగురికి గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఓ యువకుడు మిస్ అయినట్లు తెలుస్తోంది. ఓ బోటులో స్నేహితులతో వచ్చిన నాగారంకు చెందిన అజయ్ (21) కనపడడం లేదని కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. ఆదివారం రాత్రి హుస్సేన్ సాగర్ అజయ్ తో ఉన్న ఫ్రెండ్స్ అందరు సురక్షితంగా ఉన్నారు. అజయ్ మాత్రం ఏ ఆస్పత్రిలో లేడని పోలీసులు తెలిపారు. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు అజయ్ కోసం వెతుకుతున్నారు.