crimeHome Page SliderNews AlertTelangana

హైదరాబాద్‌లో భారీ డిజిటల్ కుంభకోణం..52 మంది అరెస్ట్

హైదరాబాద్‌లో డిజిటల్ ట్రేడింగ్ పేరుతో భారీ కుంభకోణం జరిగింది. బ్యాంక్ మేనేజర్, ఇద్దరు ఉద్యోగులు సహా 52 మందిని ఈ కేసులో అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న చెక్‌బుక్స్, సెల్‌ఫోన్లు, రబ్బర్ స్టాంపులు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ప్రదర్శించారు. వీరు రకరకాలుగా సైబర్ క్రైమ్‌కు పాల్పడ్డారని వెల్లడించారు. ఒక బాధితుడిని ట్రేడింగ్ పేరుతో మ్యూల్ ఖాతా తెరిపించి, దాని ద్వారా రూ.93 లక్షలను వారు కాజేశారని పేర్కొన్నారు. ఫేస్ బుక్, వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రజలను ఆకర్షించి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. తెలియని సోషల్ మీడియా గ్రూపులలో జాయిన్ కావొద్దని హెచ్చరించారు. ఇలాంటి కేసులలో రికవరీ చాలా కష్టమని, నిందితులు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు చెందిన వ్యక్తులని దానివల్ల దర్యాప్తు కూడా చాలా ఆలస్యమవుతుందని పేర్కొన్నారు. గతేడాది రూ.3,500 కోట్లు సైబర్ క్రైమ్ ద్వారా కాజేశారని, దానిలో కేవలం 13 శాతం మాత్రమే రికవరీ అయ్యిందని హెచ్చరించారు.