కాంగ్రెస్‌లో ఇంటిపోరు.. సోనియాకు ఆజాద్ షాక్
రెండేళ్లలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ పకడ్బందీ వ్యూహంతో ఇప్పటి నుంచే దూసుకెళ్తోంది. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ కొత్త ఎత్తుగడలతో విపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇటీవల `ఘర్ ఘర్ తిరంగా` పేరుతో దేశ ప్రజలను సైతం ఏకతాటిపైకి తీసుకొచ్చింది. `ఆజాదీ కా అమృత్ మహోత్సవ్` సందర్భంగా పార్టీ నాయకులు ఎక్కడికక్కడ పాదయాత్రలు చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌లో ఇంటి పోరు తీవ్రమైంది. మోదీ అధికారం చేపట్టిన ఎనిమిదేళ్లలో కాంగ్రెస్‌కు చెందిన జ్యోతిరాదిత్య సింధియా(మధ్యప్రదేశ్), అమరీందర్ సింగ్(పంజాబ్) సహా వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు కీలక నేతలు బీజేపీలో చేరారు. మరికొందరు కాంగ్రెస్‌లో ఉంటూనే ఆ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. జీ-23 పేరుతో ఇటీవల కాంగ్రెస్‌కు చెందిన అత్యంత సీనియర్ నాయకులు ఆ పార్టీ నాయకత్వంపై అసమ్మతి గళం విప్పారు. నాయకత్వం సరిగ్గా పనిచేయడం లేదని, పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. వాళ్లపై పార్టీ అధిష్ఠానం క్షక్ష కట్టడంతో ఒక్కొక్కరే పార్టీని వీడుతున్నారు. ఫలితంగా ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని కాంగ్రెస్ వదులుకోవాల్సి వస్తోంది.

రాహుల్, సోనియాల వ్యూహాలు వెలవెల
మోదీ చరిష్మా ముందు రాహుల్, సోనియాల వ్యూహాలు వెలవెలబోతున్నాయి. వీళ్లు ఏదైనా చేద్దామని ప్లాన్ చేసేలోపే మోదీ అమలు చేసేస్తూ కాంగ్రెస్‌కు నిద్ర లేకుండా చేస్తున్నారు. దీంతో ప్రజల వద్దకు వెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులకు అజెండానే లేకుండా పోతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ దేశంలోనూ, వివిధ రాష్ట్రాల్లోనూ సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్నందున ఆ పార్టీకి చెందిన చాలా మంది సీనియర్ నాయకులు కుంభకోణాలు, అవినీతిలో కూరుకుపోయారు. అవినీతిపై ప్రధాని మోదీ సమర శంఖం పూరించడంతో గతంలో అధికారం చాటున అక్రమాలకు పాల్పడిన కాంగ్రెస్ నేతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

సోనియాకు ఆజాద్ షాక్
కాంగ్రెస్ పార్టీ అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరు, జమ్మూకశ్మీర్‌లో పార్టీకి ఏకైక దిక్కు గులాం నబీ ఆజాద్ తాజాగా సోనియాకు భారీ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా చక్రం తిప్పిన గులాం నబీ ఆజాద్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు చేతులెత్తేశారు. జమ్మూకశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పార్టీని విజయతీరాలకు చేర్చే బాధ్యతను సోనియా గాంధీ.. ఆజాద్ చేతిలో పెట్టారు. జమ్మూకశ్మీర్‌లో పార్టీ ప్రచార కమిటీ సారథిగా ఆయన్ను నియమించారు. కానీ.. ఈ బాధ్యతను తీసుకునేందుకు ఆజాద్ నిరాకరించారు. అంతేకాదు.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి సైతం రాజీనామా చేశారు. కాంగ్రెస్‌పై అసమ్మతి గళం విప్పిన జీ-23 గ్రూప్‌లో కీలక సభ్యుడైన ఆజాద్ కొంత కాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యూవల్ చేయకపోవడంతో రగిలిపోతున్నారు. మరోవైపు ఆజాద్‌కు నమ్మినబంటు గులాం అహ్మద్ మీర్‌ను జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం పట్ల కూడా ఆజాద్ కినుక వహించారు.

సచిన్ పైలట్ వర్సెస్ అశోక్ గెహ్లోత్
మరోవైపు రాజస్థాన్‌లోనూ సీఎం అశోక్ గెహ్లోత్, కీలక నేత సచిన్ పైలట్ మధ్య ఎంతోకాలంగా రగులుతున్న విభేదాలు మరోసారి బహిరంగ విమర్శలకు దారి తీశాయి. కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీలో తగిన గౌరవం లభించడం లేదని సచిన్ పైలట్ ఇటీవల ఆరోపించారు. ఆ ఆరోపణలకు సీఎం గెహ్లోత్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వేదికగా చేసుకొని దీటైన జవాబిచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలకు సరైన గౌరవం దక్కడం లేదని ఇటీవల కొందరు నాయకులు కొత్త పల్లవి అందుకున్నారని, అసలు గౌరవమంటే ఏమిటో వారికి తెలుసా? అని గెహ్లోత్ ప్రశ్నించారు. అంతేకాదు.. కార్యకర్తలకు కాంగ్రెస్‌లో అత్యంత గౌరవం ఉన్నందునే తాను ముఖ్యమంత్రి కాగలిగానని ముక్తాయించారు. ఇది పరోక్షంగా సచిన్ పైలట్‌పై ఎక్కుపెట్టిన బాణంగా పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. తర్వాత నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు సచిన్ పైలట్ డుమ్మా కొట్టడాన్ని బట్టి రాష్ట్ర పార్టీలో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయని తెలుస్తోంది.

తెలంగాణాలోనూ రాజీనామాల పర్వం..
తెలంగాణాలో రేవంత్‌రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇవ్వడాన్ని రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోవడం లేదు. ఇటీవల కొండా విశ్వేశ్వరరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్, దాసోజు శ్రవణ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మొత్తానికి వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, రెండేళ్లలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఇంటినే చక్కదిద్దుకోలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ విజయం వైపు దూసుకెళ్తున్న బీజేపీతో తలపడటం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

