ఏపీలో బీఆర్‌ఎస్ ఎంట్రీపై మంత్రి రోజా ఏమన్నారంటే…
ఏపీ మంత్రి ఆర్కే రోజా నేడు తిరమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీలో బీఆర్‌ఎస్ ఎంట్రీపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. “ఉమ్మడి రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసింది ఎవరు? వారి సెంటిమెంటుతో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్నాక.. మళ్లీ ఈ రాష్ట్రంలో అడుగు పెట్టాలని అనుకోవడం ఎంత వరకు సమంజసమో ప్రజలు ఆలోచించుకోవాలి. రాష్ట్రం విడిపోయినప్పుడు దేశ వ్యాప్తంగా చూస్తే.. ఎవరైతే రాష్ట్రాన్ని కోరుకుంటారో.. వారికి రాజధాని ఇవ్వరు. వారు రాజధానిని కట్టుకోవాలి. కానీ కుట్ర పూరితంగా ఆ రోజు కాంగ్రెస్ రాజధానితో సహా తెలంగాణ ఇచ్చాకా.. కనీసం రాష్ట్రంలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కి విభజన చట్టంలో ఇవ్వాల్సిన ఏదీ కూడా ఈ రోజు వరకు ఇవ్వకుండా.. మరీ అన్యాయం చేసిన వాళ్లు ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెడితే ప్రజలు ఆలోచించాలి.. బీఆర్‌ఎస్ పార్టీలో చేరే వారికి ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలందరూ రెడీగా ఉన్నారు” అని మంత్రి రోజా వెల్లడించారు.

