News AlertTelangana

కొనసాగనున్న భారీ వర్షాలు

తెలంగాణలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గణేష్ నిమజ్జనం రోజున కూడా పలు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొవడమే కాకుండా నిమజ్జనం చేసేందుకు వచ్చిన విగ్రహాల వద్ద కూడా క్యూ నెలకొంది. అటుగా వెళ్తున్న వాహనాలను మళ్లించడంతో మెట్రో రైళ్లకు రద్దీ పెరిగింది. దీంతో ప్రయాణాలు చేసే వారు ఇబ్బంది పడగా.. మధ్యలో భారీ వర్షం కురవడంతో రాకపోకలకు అంతరాయం ఎర్పడింది. ఇక వర్షపు తీవ్రతకు రోడ్ల మీద నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

దీంతో పాదచారులు , మోటారు వాహనదారులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. అలాగే కొన్ని చోట్ల కురుస్తున్న వర్షాల తీవ్రతకు ఇంటి కప్పులు ఉడి పడుతున్నాయి. నిరంతంరంగా కురుస్తున్న వర్షాల కారణంగా ముంపు ప్రాంత ప్రజలకు , లోతట్టు ప్రాంత ప్రజలకు ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాక తెలంగాణలో శనివారం నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వివరించింది. వర్షాలతోపాటు గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల  వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది. వర్షపాత అంచనాలకు సంబంధించిన మ్యాప్‌లను ట్విట్టర్లో ట్వీట్ చేసింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా విస్తారంగా వానలు పడుతున్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణలోని నారాయణపేట్, మహబూబ్ నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది.

వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ అర్బన్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఇక మిగతా రాష్ట్రమంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వానలు ఆదివారం కాస్త తగ్గుముఖం పడతాయని, ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మాత్రం సోమవారం దాకా భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది.