రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు….
తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరియు పశ్చిమ-నైరుతి గాలుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనితో పాటు పలువురు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండగా, రేపు భూపాలపల్లి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. జూన్ 23 నాటికి సాధారణంగా 97.4 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 56.3 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదై 42 శాతం లోటు నమోదు కావడం గమనార్హం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

