శ్రీశైలం జలాశయంలో భారీగా వరదనీరు
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయంలోకి వరదనీరు పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం నాలుగు గేట్లను ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటం, ఇప్పటికే జలాశయం పూర్తిగా నిండిపోవటంతో ఈ సీజన్లో మూడోసారి గేట్లు ఎత్తేశారు. శ్రీశైలంలోకి 2,02,456 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 35,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,808 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాలుగు స్పిల్ వే గేట్లు ఎత్తి 1,08,076 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.70 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 202.96 టీఎంసీలుగా ఉంది.

