ఈజి మనీ కోసం ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచాడు
అక్రమార్జనకోసం అడ్డదారులు తొక్కాడు.అరవైలో ఇరవైలా దూసుకుపోయాడు.చివరికి ఆయన వేగానికి పోలీసులు బ్రేకులు వేశారు.కట్ చేస్తే కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే…వరంగల్ లోని శివనగర్‌లో నివాసం ఉండే 60 ఏళ్ల పల్లెబోయిన కుమార్ అనే వ్యక్తి ఈజీ గా డబ్బు సంపాదించడమెలా అని ఆలోచించాడు. నిత్యం క్రైం స్టోరీలు చూడసాగాడు.ఇంకేముంది అనుకున్నదే తడవుగా అక్రమార్జన చేసే ఆలోచన చేశాడు.నివశించే ఇంటి మేడ మీదే ఏకంగా గంజాయి మొక్కలు పెంచడం స్టార్ట్ చేశాడు.పూల కుండీలు తెచ్చి నెమ్మదిగా మొక్కలు పెంచడం స్టార్ట్ చేశాడు. ఏపుగా పెరిగిన మొక్కల ఆకులు,కొమ్మలను గంజాయికి బానిసలైన కుర్రకారుకి అమ్మడం ప్రారంభించాడు.అక్రమ వ్యాపారం మూడు పూలు ,ఆరు కాయలు సాగిపోతున్న సమయంలో గిట్టని వారెవరో ఉప్పందించారు.దీంతో పోలీసులు గంజాయి తాతను శుక్రవారం మాటు వేసి రైల్వే స్టేషన్‌లో గంజాయి మొక్కలు విక్రయిస్తుండగా పట్టుకున్నారు. అరెస్ట్ చేసి పోలీస్ట్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.