Andhra PradeshNewsNews Alert

డబ్బు కట్టండి కాకాణి… ఏకంగా మంత్రికే లోన్ యాప్ బెదిరింపులు

Share with

తెలుగు రాష్ట్రాల్లో రికవరీ ఏజెంట్లు రెచ్చిపోతున్నారు.లోన్‌ యాప్‌ వేధింపులు ప్రముఖులకు సైతం తప్పడం లేదు. ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లో వ్యవసాయమంత్రిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి తాజాగా లోన్ యాప్ బాధితుల జాబితాలో చేరారు.అయితే ఆయన లోన్ తీసుకోకుండానే లోన్ యాప్ బాధితుడిగా మారడం విశేషం . కోల్ మాన్ ఫైనాన్స్ కంపెనీ నుంచి అశోక్ కూమార్ అనే వ్యక్తి 8.50 లక్షలు లోన్ తీసుకున్నారు. అశోక్ కుమార్ ఫోన్ లో ఉన్న ప్రముఖుల నంబర్లకు ఫోన్ చేసి డబ్బులు కట్టాలని వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో లోన్ తీసుకున్న వ్యక్తి ఫోన్ లో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నంబర్ ఉండడంతో రికవరీ ఏజెంట్లు మంత్రికి ఫోన్ చేశారు. ఫోన్ లిప్ట్ చేసిన మంత్రి పీఏ శంకర్‌తో… మొత్తం వ్యవహారాన్ని ఛేదించేందుకు 25 వేలు కట్టించాడు. రికవరీ ఏజెంట్లు మళ్ళీ, మళ్ళీ కాల్స్ చేసి లోన్ కట్టలాని కట్టకపోతే పిల్లలను చంపేస్తామంటూ వార్నింగ్‌ ఇవ్వడంతో రికవరీ ఏజెంట్ల సంగతి తేల్చాలని మంత్రి పీఏ శంకర్‌..నెల్లూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు… చెన్నైనుంచి కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. నలుగురు రికవరీ ఏజెంట్లు, మేనేజర్‌ను అరెస్ట్‌ చేశారు. వారి దగ్గరి నుంచి లాప్ టాప్, నాలుగు మొబైల్స్, పదివేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

లోన్ యాప్ ఆగడాల పై స్పందించిన మంత్రి కాకాణి

ముత్తుకూరులో గడప గడపకూ కార్యక్రమంలో ఉన్న సమయంలో 79 సార్లు లోన్ యాప్ నుంచి కాల్స్ వచ్చాయన్నారు. సాధారణంగా కాల్స్ తనే లిఫ్ట్ చేస్తానన్న మంత్రి… గడప గడపకూ కార్యక్రమంలో ఉండడంతో వ్యక్తిగత సహయకుడు ఫోన్ తీశారని తెలిపారు. ఎందుకు ఫోన్ చేశారనే విషయం పై ఆరా తీశానని.. రుణం తీసుకున్న అశోక్ కుమార్ నా నంబర్ ప్రత్యామ్నాయంగా ఇచ్చారని అందుకే ఫోన్ చేస్తున్నామని రికవరీ ఏజెంట్లు చెప్పారని మంత్రి తెలిపారు. లోన్‌యాప్ ముఠాను ట్రాప్ చేసేందుకు.. పోలీసుల విచారణలో భాగంగా మా పీఏ 25,000 రూపాయలు చెల్లించడం జరిగిందని మంత్రి తెలిపారు. పోలీసుల వివరాలు సేకరించి నలుగురిని అరెస్ట్ చేశారని అయితే చెన్నై నుండి 10మంది లాయర్లు వచ్చి.. అరెస్ట్ అయిన రికవరీ ఏజెంట్లను విడిపించారని చెప్పారు. సామాన్యులకు లోన్ యాప్ నిర్వాహకుల నుండి వేధింపులు ఎక్కువయ్యాయని.. అందుకే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నట్లు మంత్రి కాకాణి స్పష్టం చేశారు. వసూళ్ల పేరుతో సామాన్యులను వేధిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.