వాడికి ఉరే సరి
‘నా కూతురు వాడ్ని ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడే.. వాడు నాకు నచ్చలేదని చెప్పేశాను. అతడిని పెళ్లి చేసుకోవద్దని.. మన వర్గానికి చెందిన మరొకరిని చూసుకోవాలని సూచించాను. కానీ.. నా మాట కూడా వినకుండా వాడితో వెళ్లిపోయింది. చివరికి కన్నవాళ్లకు కూడా లేకుండా పోయింది. ఆ మృగాడికి ఉరే సరి’ అని శద్ధా వాకర్ తండ్రి వికాస్ వాకర్ ఏడుస్తూ చెప్పారు. వాడు తన కూతురిని ఇంత కిరాతకంగా చంపేస్తాడని కలలో కూడా ఊహించలేదన్నారు. ఢిల్లీలో సహజీవనం చేసిన ప్రియురాలిని అతి కిరాతకంగా హత్య చేసి.. 35 ముక్కలుగా నరికి ఢిల్లీ నగరమంతా పడేసిన ఆఫ్తాబ్ క్రూరత్వం మాటలకు అందడం లేదంటూ శ్రద్ధ తండ్రి బోరున విలపించారు. ఈ కేసును విచారిస్తున్న కొద్దీ పోలీసులకు దిగ్భ్రాంతికరమైన దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి.

శ్రద్ధ ముఖాన్ని కాల్చేసిన మృగాడు..
శ్రద్ధ సెల్‌ఫోన్, కొన్ని శరీర భాగాలు ఇంకా లభించలేదు. దీంతో పోలీసులు గురువారం కూడా సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం నిందితుడిని తీసుకెళ్లారు. శ్రద్ధ ముఖాన్ని గుర్తు పట్టకుండా కాల్చేసినట్లు నరహంతకుడు చెప్పాడు. నిలువెల్లా క్రూరత్వాన్ని నింపుకున్న ఆఫ్తాబ్.. శ్రద్ధ ఇక లేదని చెప్పగానే ఆమె తండ్రి వికాస్ కుప్పకూలారు. శ్రద్ధ కనిపించడం లేదని ఆమె స్నేహితురాళ్లు చెప్పినప్పటి నుంచి రెండున్నర నెలలు ఆమె కోసం వెతికామని.. ఇంతటి దారుణ వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదని వికాస్ కన్నీటి పర్యంతమయ్యారు. ‘శ్రద్ధ ఎక్కడుందని నేను నిలదీస్తే.. ఆమెతో తాను కలిసి ఉండటం లేదని.. ఆమె ఎక్కడుందో మీకు ఎందుకు చెప్పాలి’ అని ఆఫ్తాబ్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినప్పుడే తన కూతుర్ని వాడు ఏదో చేసి ఉంటాడని అనుమానం కలిగినట్లు వికాస్ చెప్పారు.

