హిమాలయాలకు పొంచి ఉన్న ముప్పు..
ప్రకృతిని మించిన వైద్యుడు లేడంటారు. మనం ప్రకృతిని కాపాడితే, అది మనల్ని కాపాడుతుంది. ఈమధ్య వాతావరణంలో అసాధారణ మార్పులు సంభవించడం, అకస్మాత్తుగా వరదలు, క్లౌడ్ బరస్ట్‌లు జరగడం వంటి వాటికి ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్ అని చెప్పవచ్చు. మొన్నటికి మొన్న హిమాచల్ ప్రదేశ్‌లో వరదలకు గానీ, నిన్న పాకిస్థాన్‌లో వరదలకు కానీ హిమాలయాలు వేగంగా కరిగిపోతూండడమే ముఖ్యకారణం అంటున్నారు. హిమాలయాలలో మంచు ఫలకాలు ఈ ఏడాది రికార్డు స్థాయిలో కరిగిపోయాయని ఇండోర్ IIT బృందం గుర్తించింది. ఈ బృందం వారు 15 ఏళ్లుగా హిమాలయాల్లో మంచుపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఈ వేసవిలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఈ మంచుఫలకాలు (GLACIERS) కరిగిపోతున్నాయని అంటున్నారు.

ఒక్క హిమాలయాల్లోనే కాదు. యూరోప్‌లోని ఆల్ఫ్స్ పర్వతాలపై కూడా ఇలానే మంచుఫలకాలు కరుగుతున్నాయి. భూమి యొక్క ఉత్తర,దక్షిణ ధ్రువాల తర్వాత అత్యధికంగా మంచు ఉండే ప్రదేశాలు హిమాలయాలే. ఈ శతాబ్దం మొత్తం ఈ రకంగా మంచు కరగడం జరిగితే కనుక భవిష్యత్తులో నీటి కరువు తలెత్తే అవకాశం ఉంది. 2021లో ఇండోర్ ఐఐటీ బృందం హిమాలయాల్లో కొన్ని ప్రమాదకర సంకేతాలను గుర్తించింది.

ఈసంవత్సరం వేసవిలో ఉష్ణోగ్రతలు 100 ఏళ్ల రికార్డులను తిరగరాసాయి. ఈ ఐఐటీ పరిశోధకుల బృందంలోని గ్లేసియాలజిస్టు మహమ్మద్ ఫరూఖ్ అజమ్ పేర్కొన్నదాన్ని బట్టి గతవారం వారు ఆ మంచు ఫలకాలపై చేసిన ప్రయోగాలలో హిమాలయాల్లో ఎన్నడూ లేనంత మంచు కరిగిపోయడాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. హిమాలయాలపై మంచు కరగడం వల్లే పాకిస్థాన్‌లో అతి తీవ్రస్థాయిలో వర్షాలు పడి నదులు పొంగిపోయి, వరదలు సంభవించాయి. లక్షల హెక్టార్లలో పొలాలు నీట మునిగాయి. 20 డ్యామ్‌లపై నుండి నీరు కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. ఇకనైనా మేలుకుని తగిన చర్యలు తీసుకుంటూ ప్రకృతిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తే మానవాళి ఈముప్పు నుండి తప్పించుకోవచ్చు.