కర్ణాటక మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్
కర్ణాటక సర్కార్ మహిళా ఉద్యోగుల కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. వారికి గుడ్ న్యూస్ చెప్పింది. వారి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం నెలలో ఒకరోజు నెలసరి సెలవును మంజూరు చేయడానికి అంగీకరించింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పనిచేసే మహిళలకు ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇది మహిళా ఉద్యోగుల పనివాతావరణాన్ని మెరుగు పరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిపాదనకు కర్ణాటక క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఒడిశా, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ సెలవు అమల్లో ఉండగా.. తాజాగా, కర్ణాటక ఆ జాబితాలో చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, గార్మెంట్ ఫ్యాక్టరీలు, బహుళజాతి సంస్థలు, ఐటీ సహా ఇతర ప్రయివేట్ సంస్థల్లో పనిచేసే మహిళలకు ఒకరోజు నెలసరి సెలవు తప్పనిసరి అని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఈ సెలవు వల్ల మహిళా ఉద్యోగులలో నెలసరి ఆరోగ్యంపై అవగాహన పెంచడమే కాకుండా, వారి శారీరక, మానసిక సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది’ అని క్యాబినెట్ నోట్ లో స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల పనిచేసే మహిళలకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చుతుందని కర్ణాటక రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్ కే పాటిల్ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ విధానం విజయవంతమైందని, కర్ణాటకలోనూ దీనిని అమలు చేయాలని నిర్ణయించామని క్యాబినెట్ సమావేశం అనంతరం మీడియాతో వెల్లడించారు.