Home Page SliderNational

తీహార్ జైల్లో ప్రత్యర్థుల చేతిలో గ్యాంగస్టర్ టిల్లు హత్య

ఈ ఉదయం ఢిల్లీలోని తీహార్ జైలులో ప్రత్యర్థి ముఠా సభ్యులు జరిపిన దాడిలో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ టిల్లూ తాజ్‌పురియా మరణించాడు. హైసెక్యూరిటీ ఉన్న జైలులో గ్యాంగ్‌స్టర్ యోగేష్ తుండా, అతని సహాయకులు ఇనుప రాడ్‌లతో టిల్లు తాజ్‌పురియా, అలియాస్ సునీల్ మాన్ కొట్టారని పోలీసులు తెలిపారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. ఈ దాడిలో మరో ఖైదీ రోహిత్‌ కూడా గాయపడ్డాడు. యోగేష్ తుండా, దీపక్ తీటర్, రియాజ్ ఖాన్, రాజేష్ జైలు మొదటి అంతస్తులో ఉన్న వారి వార్డులోని ఇనుప గ్రిల్స్‌ను పగలగొట్టి… నలుగురు సభ్యులు గ్రౌండ్ ఫ్లోర్‌కు దిగేందుకు బెడ్‌షీట్లను ఉపయోగించారు. ముఠా సభ్యులతో కలిసి గ్రౌండ్ ఫ్లోర్ వార్డులో ఉన్న టిల్లును ముందుగా తెచ్చుకున్న రాడ్లతో దాడి చేసి చంపారు.

2021 రోహిణి కోర్టు కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగిని చంపిన కేసులో టిల్లు ప్రధాన కుట్రదారు. టిల్లూ గ్యాంగ్‌లోని ఇద్దరు సభ్యులు, లాయర్ల వేషధారణలో, రోహిణి కోర్టులో సెప్టెంబరు 24, 2021న జితేందర్ గోగిని కాల్చి చంపారు. ఆ తర్వాత పోలీసుల కాల్పుల్లో ఇద్దరూ మరణించారు. “కోర్టు లోపల జితేందర్ గోగిపై లాయర్ల వేషంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. అప్పుడే పోలీసులు ఎదురుకాల్పులు జరిపి ఆ ఇద్దరు దుండగులను హతమార్చారు. ” అని పోలీసులు చెప్పారు. జితేందర్ గోగి గ్యాంగ్, టిల్లు గ్యాంగ్ మధ్య ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఉన్నారు. టిల్లూ తాజ్‌పురియా హత్యపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఒక నెల వ్యవధిలో తీహార్ జైలులో హింస, గ్యాంగ్ దాడుల ఘటనలు జరగడం ఇది రెండో కేసు. గత నెలలో, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు ప్రిన్స్ తెవాటియాను ప్రత్యర్థి ముఠా సభ్యులు తీహార్ జైలులో చంపారు.