Home Page SliderNational

కర్నాటకలో గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ

మైనింగ్ వ్యాపారి జనార్దన్‌ రెడ్డి కొత్త పార్టీ
కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్‌పీపీ) పేరుతో కొత్త కుంపటి
సిబిఐ అరెస్టుతో పుష్కరకాలంగా రాజకీయాలకు దూరం
2023 కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నాహాలు

కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం నాలుగు నెలలున్న సమయంలో… బీజేపీ నేత వివాదాస్పద మైనింగ్ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి సొంత పార్టీ – కళ్యాణ రాజ్య ప్రగతి పక్షాన్ని ఆవిష్కరించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో గంగావతి నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని ప్రకటించారు. సొంత పార్టీ పెట్టడంపై నెలరోజుల ఊహాగానాలకు తెరపడింది. ఇది రెడ్డి రాజకీయాల్లోకి సెకండ్ ఇన్నింగ్స్‌గా ఆయన అభివర్ణించారు. 2018 నుండి రాజకీయాల్లోకి తిరిగి రావడానికి ఆయన ప్రయత్నిస్తున్నా… బిజెపి నుండి సానుకూలత లభించకపోవడంతో ఆయన తాజాగా ఈ ప్రకటన చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. బెంగళూరులోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇది తన కొత్త రాజకీయ ఎపిసోడ్ అని అన్నారు.

దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి విగ్రహం, బసవేశ్వరుడి భారీ చిత్రపటం ముందు కూర్చొని ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలను విభజించి, దాని పర్యవసానాల నుంచి లబ్ధి పొందాలని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తే, కర్ణాటకలో అది సాధ్యం కాదని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ ఐక్యంగానే ఉన్నారని… బసవన్న ఆశయాలను తమ పార్టీ అనుసరిస్తుందని, కుల, మతాల ఆధారంగా విభజించే రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధే తన ధ్యేయమని పేర్కొన్న ఆయన 30 జిల్లాల్లో ఒక్కో అభివృద్ధి అంశాలను పరిశీలిస్తామన్నారు. సతీమణి అరుణ ప్రజా జీవితంలోకి దూసుకెళ్లి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారని ప్రకటించారు. కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష (హైదరాబాద్-కర్ణాటక ప్రాంతం) ప్రజలకు సేవ చేసేందుకు ఇక్కడికి వచ్చానని, రానున్న ఎన్నికల్లో ప్రతి ఇంటిని సందర్శిస్తానని చెప్పారు.

సన్నిహితుడు మరియు రవాణా శాఖ మంత్రి బి శ్రీరాములుతో విభేదాలను తోసిపుచ్చుతూ రెడ్డి, “నాకు బిజెపిలో ఎవరితోనూ విభేదాలు లేవు. శ్రీరాములుకు చిన్నప్పటి నుంచి ఆప్త మిత్రుడు, సత్సంబంధాలు కొనసాగిస్తాం’ అని అన్నారు. బీఎస్ రాములు తన పార్టీలో చేరడం గురించి మాట్లాడుతూ, తాము మంచి స్నేహితులమని, ఐతే పార్టీ మారాలని ఎవరిపైనా ఒత్తిడి చేయనన్నాడు. రాములు తనకు నచ్చిన నిర్ణయం తీసుకుంటారన్నారు. అక్రమ మైనింగ్ ఆరోపణలపై గాలి జనార్దన్ రెడ్డి జైలుకెళ్లినప్పటి నుంచి ఆయనకు బీజేపీ నేతలతో విభేదాలపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కోట్లాది రూపాయల అక్రమ మైనింగ్ కేసులో నిందితుడైన ఆయన 2015 నుంచి బెయిల్‌పై బయట ఉన్నారు. బెయిల్ మంజూరు చేస్తూనే, పాస్‌పోర్టును సరెండర్ చేయాలని, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కోర్టు ఆదేశించింది.

సంక్షోభ సమయంలో, పార్టీ నాయకులు, కేంద్ర నాయకులు తనకు అండగా నిలబడలేదని ఆరోపించిన ఆయన, అవసరమైన సమయంలో మాత్రమే స్నేహితులు ఎవరో తెలుస్తుందన్నారు. అరెస్టు సందర్భాన్ని గుర్తు చేస్తూ… మాజీ ముఖ్యమంత్రులు B S యడియూరప్ప, జగదీష్ షెట్టర్ మాత్రమే నా భార్య మరియు పిల్లలను చూసుకున్నారన్నారు. ఇంకెవరూ కనీసం పరామర్శించలేదన్నారు. మంచిగా ఉన్నప్పుడు అందరూ చుట్టూ ఉంటారుని… కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే మీ స్నేహితులు ఎవరో మీకు తెలుస్తుందన్నారు. బీజేపీకి జనార్దన రెడ్డికి సంబంధం లేదని కేంద్ర హోం మంత్రి వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. షా ఎందుకు ఆ ప్రకటన చేశారో … అందుకు ఎరు ప్రేరేపించారో తెలియదన్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో సొంత పార్టీతో పనిచేస్తానన్నారు.

బీజేపీ కోసం తాను ఎంతగానో కష్టపడ్డానన్నారు. 2006లో జనతాదళ్ (ఎస్)తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో… బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించానని చెప్పారు. JD(S) BJPకి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైనప్పుడు రాష్ట్రమంతటా పర్యటించానన్నారు. 2008లో బీజేపీని సొంతంగా అధికారంలోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించానన్నారు. కానీ నా కుటుంబం, నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ అండగా నిలవకపోవడం దురదృష్టకరమన్నారు. యడియూరప్పతో తనకున్న సంబంధాన్ని ‘తండ్రీకొడుకులు’గా పేర్కొంటూ, పార్టీని ప్రారంభించాలనేది తన వ్యక్తిగత నిర్ణయమని, దానిపై తాను యడియూరప్పతో చర్చించలేదని అన్నారు.