NationalNews

23 ఏళ్ల తర్వాత విముక్తి లభించింది… కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన ఖర్గే!

కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో తనకు ఉపశమనం లభించిందన్నారు సోనియా గాంధీ నా కర్తవ్యాన్ని శక్తి మేరకు నిర్వర్తించానన్న సోనియా… 23 ఏళ్ల తర్వాత… ఈ బాధ్యతల నుండి విముక్తి పొందానన్నారు. నా భుజంపై బరువు తగ్గిందని ప్రశాంతత కలుగుతోందన్నారు సోనియా గాంధీ.
కాంగ్రెస్ పార్టీ చీఫ్ బాధ్యత చాలా పెద్దదని.. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే అది నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. దేశంలో ప్రజాస్వామ్య విలువల సంక్షోభమే నేడు అతిపెద్ద సవాలు అని సోనియా గాంధీ అన్నారు.


కాంగ్రెస్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని… వాటిని పూర్తి శక్తితో, ఐక్యతతో ముందుకు సాగి విజయం సాధించాలని కాంగ్రెస్‌ నేతలతో జరిగిన సమావేశంలో ఆమె అన్నారు. 80 ఏళ్ల మల్లికార్జున్ ఖర్గే గత వారం జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి శశిథరూర్‌పై భారీ మెజారిటీతో గెలుపొందారు. గాంధీలు ఆమోదించిన అభ్యర్థిగా ఖర్గే గెలుపొందడం ఖాయమని మొదట్నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. 25 ఏళ్లలో తొలిసారిగా కాంగ్రెస్ అత్యున్నత పదవికి పోటీ చేయని గాంధీలకు ఖర్గే ఒక డమ్మీగా వ్యవహరిస్తారని పలువురు ఆరోపిస్తున్నారు. ఐతే ఈ విమర్శలను కాంగ్రెస్ పార్టీ తిప్పి కొట్టింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు పెద్ద విజయాన్ని సాధించాయని, పార్టీలో ప్రజాస్వామ్య విలువలకు నిదర్శనమని నొక్కి చెప్పారు పార్టీ నేతలు.


సోనియా గాంధీ తర్వాత మాట్లాడిన ఖర్గే, ఆమె నాయకత్వాన్ని కొనియాడారు. సోనియా గాంధీ ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటారు, ఆమె చూపిన ఉదాహరణ అసమానమైనది. ఆమె నాయకత్వంలో, రెండు యూపీఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని… ఆ ప్రభుత్వాల హయాంలో మహాత్మా గాంధీ ఆహార భద్రతా చట్టం (MGNREGA), సమాచార హక్కు (RTI) చట్టం అమలు చేయబడ్డాయన్నారు.