Andhra PradeshHome Page Slider

‘మాజీ ముఖ్యమంత్రికి దేవుడిని దర్శించుకునే హక్కు లేదా?’..జగన్

తనను తిరుమలకు చేరకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రాంగం వేశారన్నారు వైసీపీ నేత జగన్. మాజీ ముఖ్యమంత్రికి భగవంతుడిని దర్శించుకునే హక్కు కూడా లేదా? అంటూ నిలదీశారు. తిరుమల లడ్డూ పవిత్రతను ముఖ్యమంత్రి చంద్రబాబు దెబ్బతీశారని ఈ ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయారని వ్యాఖ్యానించారు. నేడు తన తిరుమల యాత్రను రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు జగన్. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజకీయ దుర్భుద్దితోనే కూటమి పార్టీలు, నేతలు లడ్డూ వ్యవహారంపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. జంతువుల కొవ్వు లడ్డూ నెయ్యిలో కలిసిందని చెప్పి కోట్లమంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు తిరుమలకు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నానని, మరి ఇప్పుడెందుకు డిక్లరేషన్ అడుగుతున్నారని ప్రశ్నించారు. గతంలో పాదయాత్ర చేసేముందు కూడా స్వామివారి దర్శనం చేసుకునే మొదలుపెట్టాను. పూర్తయ్యాక కూడా తిరుమలకు వెళ్లాను. బ్రహ్మోత్సవాలలో ఐదుసార్లు స్వామివారికి వస్త్రాలు సమర్పించాను. నా కులం,మతం ప్రజలందరికీ తెలుసు. గుడికి వెళ్లే వ్యక్తులను మతాల గురించి అడగడం మంచిపద్దతి కాదు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు