రష్యాకు ఐదోసారి కూడా పుతినే అధ్యక్షుడా?
రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరపడానికి రష్యా పార్లమెంట్ అంగీకరించింది. ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ పదవీకాలం 2024సంవత్సరానికి ముగియనుంది. ఈ సందర్భంగా ఐదోసారి కూడా రష్యా అధ్యక్షునిగా పుతిన్ అధికారం చేపట్టబోతున్నారా? అనే అంశం ఆసక్తిగా మారింది. రష్యా పార్లమెంట్ ఎగువ సభ అధ్యక్ష ఎన్నికల తేదీని ఏకగ్రీవంగా ఆమోదించింది. మార్చి17, 2024న ఈ ఎన్నికలు జరుగనున్నాయి. వ్లాదిమిర్ పుతిన్ గత 20 సంవత్సరాలుగా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ప్రస్తుత ఉక్రెయిన్ యుద్ధంలో పుతిన్ అనుసరించిన వ్యూహాలకు అక్కడి ప్రజలు అనుకూలంగా స్పందించారు. రాజ్యాంగ సంస్కరణలలో భాగంగా మరో రెండుసార్లు అధ్యక్ష పదవికి పోటీ చేసే చట్టాన్ని ప్రజలు ఆమోదించారు. దీనితో మరో రెండుసార్లు ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. ఆరేళ్ల పదవీకాలంతో మరో రెండుసార్లు అంటే 2036 వ సంవత్సరం వరకూ ఆయన పదవిలో కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే 71 సంవత్సరాల వయస్సున్న పుతిన్ తన జీవిత కాలం రష్యా అధ్యక్షునిగానే కొనసాగే వీలుంది. సోవియట్ పాలకుడు జోసెఫ్ స్టాలిన్ కన్నా వ్లాదిమిర్ పుతిన్ అత్యధిక కాలం పాటు అధ్యక్ష పదవిలో కొనసాగడం విశేషం.

