4 టన్నుల మామిడిని ఉచితంగా పంపిణీ చేసిన రైతు
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదరకు చెందిన రైతు వినూత్నంగా నిరసన తెలిపాడు. కష్టపడి పండించిన పంటను దళారుల పాలు చేయడానికి ఇష్టం లేక 4 టన్నుల మామిడిని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశాడు రైతు బెక్కం రాజగోపాలరావు. ఎకరానికి 60 వేల వరకు పెట్టుబడి పెట్టి నాలుగెకరాల్లో మామిడి సాగు చేశాడు. పంట కోసి శనివారం 4 టన్నుల బంగినపల్లి మామిడిని ఈదర మార్కెట్‌కు తీసుకొచ్చాడు. వ్యాపారులు టన్నుకు 6 వేలు ధర పలకడంతో అక్కడ విక్రయించకుండా వెనక్కు తీసువచ్చి 4 టన్నుల మామిడిని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశాడు. దళారులు కుమ్మకై ధరలను పెంచేసి ఎక్కువ లాభాన్ని ఆర్జిస్తున్నారు. ఇది చూసిన రాజగోపాలరావు ఆవేదన చెందాడు. గత సంవత్సరం టన్ను 30 వేల నుంచి 40 వేల వరకు ఉండే ధరను వ్యాపారులు 4 వేల నుంచి 12 వేల వరకు నిర్ణయిస్తున్నారని తన బాధను చెప్పుకున్నాడు. దళారులు రైతులను నిలువునా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వంపై ఇలాంటి దళారులపై చర్యలు తీసుకోవాలని రాజగోపాలరావు కోరుతున్నాడు.
