Andhra PradeshHome Page SliderPolitics

ఎంఎస్ఎంఈ రంగంలో మూడేళ్లలో 5,61,235 ఉద్యోగాల కల్పన

Share with

ముఖ్యమంత్రి వైయస్ జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పలు మైలురాళ్లను అధిగమిస్తోందని, పారిశ్రామిక వృద్ధిలో అగ్రగామిగా మారిందని రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. గుంటూరు వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కేవలం మూడేళ్లలోనే ఎంఎస్ఎంఈ యూనిట్ల సంఖ్య 60% పెరగడంతోపాటు, ఉద్యోగాల కల్పనలో 38% పెరుగుదల నమోదు చేసిందన్నారు. ‘ఎంఎస్ఎంఈ రీస్టార్ట్’, ‘వైయస్సార్ జగనన్న బడుగు వికాసం’, ‘డా. వైయస్సార్ నవోదయం’ తదితర పథకాల ద్వారా ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం పలు రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తోందని వివరించారు. దూరదృష్టితో ఆలోచించే సీఎం జగన్ నాయకత్వం రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల అభివృద్ధి ప్రగతిపథంలో పురోగమిస్తోందని స్పష్టం చేశారు.

పారిశ్రమల రాకతో స్థానికంగా ఉద్యోగ కల్పన గణనీయంగా పెరిగిందన్నారు. మూడేళ్ల క్రితం 37,956 ఉన్న ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏకంగా 60,800 యూనిట్లకు పెరిగిందని, తద్వారా 5 లక్షల 61 వేల 235 మందికి ఉపాధి లభించిందని తెలిపారు. ఎంఎస్ఎంఈల వృద్ధిని ప్రోత్సహించడానికి, ప్రభుత్వం ఎంఎస్ఎంఈ ఖాతాలకు ‘వన్ టైమ్ రీస్ట్రక్చరింగ్’ను అందిస్తోందని ఎంపీ అయోధ్య రామిరెడ్డి వివరించారు. డాక్టర్ వైయ్సార్ నవోదయం పథకం ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ రుణాల కోసం సహాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదన్నారు. 2021 నాటికే చూస్తే 1.78 లక్షల ఎంఎస్ఎంఈ రుణ ఖాతాలు(దాదాపు 22%) పునర్వ్యవస్థీకరించబడ్డాయని స్పష్టం చేశారు. అట్టడుగువర్గాల వ్యాపారాలను ప్రోత్సహించాలనే యోచనతో ప్రభుత్వం తెచ్చిన “వైయస్సార్ జగనన్న బడుగు వికాసం”తో 5 వేల 725 మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈ యూనిట్లకు రూ. 347 కోట్లు, 1138 ఎస్టీ పారిశ్రామికవేత్తల ఎంఎస్ఎంఈల యూనిట్లకు రూ. 66 కోట్లు విడుదల చేసిందని వివరించారు.

మహిళా పారిశ్రామికవేత్తల ద్వారా సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా వంటి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. వైయస్సార్ ఆసరా ద్వారా 33.5 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 2568 కోట్లు, వైయస్సార్ చేయూత కింద 17.89 లక్షల మందికి రూ. 3356 కోట్ల సాయం అందించినట్లు తెలిపారు.  “రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని పెంచడం కోసం, సీఎం జగన్ అధ్యక్షతన ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు(SIPB) 2022 జూలైలో రూ. 1.26 లక్షల కోట్లు, 2022 డిసెంబర్ లో రూ. 23,985 కోట్లు, 2023లో రూ. 1.44 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. మొత్తంగా రూ. 2.93 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఏపీకి తెచ్చినట్లు ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వివరించారు.