Home Page SliderTelangana

కేసీఆర్‌ను అంత మాటంటావా రాజేందర్..!

రాజకీయ నాయకుల దగ్గరకి వచ్చి వందల మంది సెల్ఫీ ఫోటోలు దిగుతారని… అంత మాత్రాన ప్రతి ఒక్కరితో సంబంధం ఉంటుందా అని ప్రశ్నించారు బీజేపీ సీనియర్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. హిందీ పరీక్ష రోజు ఎవరో ఓ వ్యక్తి వాట్సాప్ చేస్తే.. కనీసం అది చూడకపోయినా నాకు నోటీసులు ఇస్తారా అంటూ మండిపడ్డారు. చట్టాల మీద నమ్మకం ఉందని… పోలీసులపైనా నమ్మకం ఉందన్న ఈటల.. తాను తప్పక విచారణకు హాజరవుతానన్నారు. బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి, నాకు నోటీసులు ఇచ్చి మా కార్యకర్తలను భయం పెట్టాలని చూస్తున్నారని… నోటీసులకు భయపడే వ్యక్తిని తాను కాదన్నారు ఈటల. ప్రేమకు వంగుతాం తప్ప దబాయిస్తే ఇంకో నాలుగు ఎక్కువ దబాయిస్తామంటూ ధ్వజమెత్తారు. తనకు కేసులు కొత్తకాదన్న ఆయన కేసీఆర్‌కి పోయే కాలం వచ్చిందన్నారు. ఆరిపోయే ముందు దీపం వెలుగులాంటింది కేసీఆర్ సర్కారన్నారు. ఓడిపోయే ముందు ఆరాటపడుతున్నారని… తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు కర్రుగాల్చి వాతపెడతారన్నారు. తెలంగాణ ప్రజలు నిజమైన న్యాయ నిర్ణేతలన్నారు ఈటల.