ఇక ఈ యుద్ధం చాలంటూ.. హరిద్వార్‌లో రష్యన్ల పూజలు
రష్యా, ఉక్రెయన్ల మధ్య యుద్ధం మొదలై సంవత్సరం దాటింది. ఎవ్వరూ వెనక్కు తగ్గటం లేదు. అంతు లేకుండా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల ప్రజలు విసిగి వేసారపోసాగారు. నాయకులు మాత్రం యుద్ధం ఆపటం లేదు. దీనితో ‘దేవుడా నీవే దిక్కంటూ’ 24 మంది రష్యన్లు భారత్‌కు వచ్చి హరిద్వార్‌లోని గంగానదిలో పవిత్ర స్నానం చేసి, ఇకనైనా ఉక్రెయిన్‌తో యుద్ధం ఆగిపోవాలని పూజలు చేశారు. కంఖాల్‌లోని రాజ్ ఘాట్‌లో హిందూ ఆచారాలు పాటిస్తూ గంగామాతను ప్రార్థించారు. ప్రపంచశాంతిని కోరుకున్నారు.

గత సంవత్సరం ఫిబ్రవరి 24 న మొదలైంది రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం. ఈ సంవత్సరంలో ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భారీ ఆస్తినష్టం జరిగింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ఎన్నో దేశాలపై ఈ యుద్ధ ప్రభావం పడింది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకూ 70 వేల కోట్ల డాలర్ల నష్టం జరిగిందని అంచనా. ఈ రష్యన్ల బృందం ప్రత్యేకంగా పూజల కోసం రష్యానుండి వచ్చామని, హిందూ ఆచారాలపై నమ్మకంతో గంగకు పూజలు చేశామని తెలిపారు. ఇప్పటికైనా యుద్ధం ఆగిపోవాలని శాంతి నెలకొనాలని రెండు దేశాల ప్రజలు బలంగా కోరుకుంటున్నారని వారు పేర్కొన్నారు.

