మునుగోడులో కొత్త పుంతలు తొక్కుతున్నఎన్నికల ప్రచారం
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమీపిస్తుండటంతో గతంలో జరిగిన అన్ని ఎన్నికలకు భిన్నంగా ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రధాన పార్టీ అభ్యర్థులు తమ బలాబలాలను చెప్పుకుంటూనే ప్రత్యర్థుల బలహీనతలను తమ ప్రచారంలో ఏకరువు పెడుతున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు గ్రామాల వారీగా ఓటర్లను ఆకట్టుకోవడానికి అంశాన్ని వదలకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీనికి తోడు కంప్యూటర్ సెల్‌ఫోన్‌లకు అతుక్కునే యువత, మహిళలు, ఉద్యోగ వ్యాపారాలతో బిజీగా ఉండే వారిని ఓటు అడగడానికి ఆయా పార్టీల అభ్యర్థులు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా యువత ఓట్లను రాబట్టుకునేందుకు టెక్నాలజిని ఎంచుకుంటున్నారు.

ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే సభలు, సమావేశాలు, ర్యాలీలు, కరపత్రాల పంపిణీతో ఊళ్లల్లో హోరెత్తిపోయేవి. కానీ నేడు సోషల్‌మీడియా పుణ్యమా అని రాజకీయ పార్టీల నాయకులు నేరుగా ఓటర్లతో ఫేస్‌బుక్, వాట్సాప్,య్యూటూబ్ ద్వారా నిత్యం టచ్‌లో ఉంటున్నారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,41,367 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో కనీసం సగానికి పైగానే స్మార్ట్‌ఫోన్ ఉన్న వారు ఉంటారు. వీరి నంబర్లను ఆయా పార్టీలు సేకరించి తమ అభ్యర్థి, పార్టీ గుర్తు, గెలిపిస్తే చేసే సేవలు, అభివృద్ధి పనులు వంటి వాటిని ఉదయం నుంచి సాయంత్రం వరకు బల్క్ పోస్టింగ్‌లను అభ్యర్థుల తరపున ఓటర్ల ఫోన్‌లకు పంపిస్తున్నారు. ప్రధాన పార్టీలైన బీజేపీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు సామాజిక మాధ్యమాలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాయి.

