Home Page SliderNational

‘ఏక్ బార్ ఫిర్ మోడీ సర్కార్’ దేశంలో మోదీ మేనియా

దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ క్రేజ్ అమాంతంగా పెరుగుతోంది. ముందెన్నడూ లేని విధంగా మోదీ ఈసారి మరోసారి అధికారంలోకి రాబోతున్నారంటూ ఇప్పటికే ఫుల్ క్లారిటీ వచ్చేసింది. దేశంలో ఎవరికి లేని గ్యారెంటీ ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రమే కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ఎన్నికల్లో బీజేపీని విజయతీరాలకు చేర్చుతారని అటు బీజేపీ నాయకులు, ఇటు దేశ ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. బీజేపీ నాయకులు సైతం వచ్చే ఎన్నికల్లో కాషాయధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి హస్తిన పీఠంపై ఎగురేస్తారని దీమా వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సానుకూలత బీజేపీని మరోసారి విజయతీరాలకు చేర్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన పదేళ్లలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు… ఆ పార్టీని మరోసారి అధికార పీఠంపై కూర్చోబెడతాయన్న భావన వ్యక్తమవుతోంది. 2014లో బీజేపీ, ఆప్ కీ బార్ మోడీ సర్కార్ అంటూ ప్రజల్లోకి వెళ్ళింది. 2019లో ‘మోదీ హై తో ముమ్కిన్ హై’, ‘ఏక్ బార్ ఫిర్ మోడీ సర్కార్’ అంటూ ప్రచారం చేసింది. ఇక 2024లో ‘మోదీ గ్యారెంటీ’ అంటూ ఇప్పటికే ప్రచారపర్వాన్ని లంఖించుకొంది. తాజాగా ‘ఫిర్ ఆయేగా మోదీ’ అంటూ దూసుకెళ్తోంది.

మొత్తంగా దేశంలో మోదీ బ్రాండ్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ అస్త్రంగా నిలవనుంది. లోక్ సభ ఎన్నికల్లో గతంలో రెండు సార్లు గెలిపించిన మోదీ బ్రాండ్… మరోసారి పార్టీని విజయతీరాలకు చేర్చుతుందని… పార్టీ నేతలు విశ్వాసంతో ఉన్నారు. మోదీ గ్యారంటీ అంటే కచ్చితంగా మోదీ నెరవేర్చుతారన్న నమ్మకం ప్రజల్లో ఉందని బీజేపీ నాయకులు దేశ వ్యాప్తంగా చెబుతున్నారు. గడిచిన పదేళ్లలో రాజకీయ పార్టీల ఉత్థాన పతనాలు ఎన్నో చూసాం కానీ… బీజేపీని అందుకు మినహాయింపుగా చెప్పాల్సి ఉంటుంది. అప్పటివరకు ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు పెరగడమే గాని తగ్గడం అన్నది దేశంలో ఎక్కడా కనిపించదు. ఆయా ప్రాంతాల్లో బీజేపీ అసలు లేకపోవడం, ఉన్నా అంతంత మాత్రంగానే ఉండటం అన్న ఏరియాల్లోనూ… బీజేపీ ఓటర్ బేస్‌ను పెంచుకుంటూ పోతోంది. 2014లో బీజేపీకి 31% ఓట్ల రాగా, 282 లోక్ సభ సీట్లు వచ్చాయి. 2019లో 37% ఓట్లు రాగా 303 లోక్ సభ సీట్లలో పార్టీ విజయం సాధించింది.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ భారీ టార్గెట్ నిర్దేశించుకొంది. బీజేపీకి మద్దతిచ్చే ఓటర్ బేస్ శాతం ఈసారి 50 శాతం చేరాలని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గతంలో విజయం సాధించిన 303 స్థానాలకు మించి విజయం సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకొంది. బీజేపీ సిద్ధాంతాలు, విధానాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. కాదు కాదు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దు, వారణాసిలో పరమ శివుని ఆలయ పునరుద్ధరణ పనులు, ఉజ్జయినిలో మహాలోక్ కొంగొత్తగా తీర్చిదిద్దడం దగ్గర నుంచి అయోధ్య రామ మందిర నిర్మాణం వరకు.. బీజేపీ నిర్ణయాలు హిందూ బంధువులలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. సనాతన ధర్మాన్ని పరిరక్షించేది బీజేపీయేనన్న భావనకు ఓటర్లు వస్తున్నారు. జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఇప్పటికీ రాముని అక్షింతలు దేశంలోని నలుమూలలకు చేరాయి. ఇటు కశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు… ఇటు అటక్ నుంచి కటక్ వరకు ప్రతి గ్రామంలోనూ రామజపం ప్రతిధ్వనిస్తోంది. రామాలయం ప్రారంభోత్సవం తర్వాత దేశ వ్యాప్తంగా 17 కోట్ల కుటుంబాలకు రాముని చిత్రాన్ని చేర్చేలా బీజేపీ మంత్రాంగం చేస్తోంది. పలు రాష్ట్రాల నుంచి భక్తులను అయోధ్యకు తీసుకువచ్చేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఓవైపు అభివృద్ధి నినాదం, మరోవైపు హిందుత్వం రెండూ కలగలిపితే… వచ్చే ఎన్నికల్లో బంపర్ విక్టరీ సాధ్యమేనని కాషాయదండు భావిస్తోంది.

దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్లు, 5 వేల బిలియన్లు… అంటే 415 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా పట్టణ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ నేతలు. మేకింగ్ ఇండియా నినాదాలు ఇప్పుడు యువతకు పెద్ద ఎత్తున కాషాయం పార్టీ వైపు ఆకర్షించడానికి కారణమవుతోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపులో యువతే ప్రధానంగా భూమిక వహించే అవకాశం ఉందన్న ఆలోచనలో ఆ పార్టీ ఉంది. 2024లో బీజేపీ యువతను తమ వైపు తిప్పుకొని ఓటర్లను ప్రభావితం చేయాలని టార్గెట్‌గా పెట్టుకొంది. బీజేపీని అభిమానించే ఓటర్లను పార్టీకి దగ్గర చేసేలా నేతలను కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కేంద్ర నాయకత్వం సూచించింది కూడా. మరీ ముఖ్యంగా పేద వర్గాల కోసం ప్రవేశపెట్టిన పథకాలకు తోడుగా ఇటీవల ప్రవేశపెట్టిన విశ్వకర్మ పథకం ద్వారా లక్ష రూపాయల సాయం అందించే పథకంపై బీజేపీ విశ్వాసంతో ఉంది. ఎన్నికలకు ముందు బీజేపీ పెద్దలు… దేశవ్యాప్తంగా వివిధ వర్గాల పెద్దలను, మేధావులతో చర్చిస్తున్నారు. వారి ఆలోచనలను స్వీకరిస్తూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలకాలని నేతలు కోరుతున్నారు. వికసిత్ సంకల్ప యాత్ర ద్వారా యువతను… ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్లుగా చేస్తూ మరింతగా వారి అభిమానాన్ని చూరగొనాలని పార్టీ యోచిస్తోంది.

2019 లోక్ సభ ఎన్నికల్లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు బీజేపీకి మద్దతుగా నిలిచారు. వారి సంఖ్య సుమారుగా 80 కోట్లవరకు ఉంది. వారంతా తాజా ఎన్నికల్లోనూ తమకు మద్దతిస్తారని… చాలా మంది కేవలం ఒక్క పథకమే కాకుండా రెండు పథకాల లబ్ధిదారులుగా ఉన్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వారందరూ వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా, జిల్లాల వ్యాప్తంగా బీజేపీ కాల్ సెంటర్ల ద్వారా విజ్ఞప్తి చేస్తోంది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాతోపాటుగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సామాజిక సమీకరణాలు పార్టీ విజయంలో కీలక భూమిక పోషించాయి. ఆయా రాష్ట్రాల్లో సోషల్ ఇంజనీరింగ్ ద్వారా బీజేపీ ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకొంది. యూపీ, బీహార్‌లో పార్టీ కుల సమీకరణాలతో అనూహ్య ఫలితాలను సాధించింది. యూపీలో యాదవులు కాకుండా ఇతర బీసీలు, ఎస్సీలు కాకుండా జాతవేతరులు, ఈబీసీలతో రాజకీయం వర్కౌటయ్యింది. హర్యానాలో జాటేతర్లు, ఓబీసీలు, పట్టణ ఓటర్లను లక్ష్యంగా పెట్టుకుంది. ఇక గిరిజన ప్రాంతాల్లో నాయకత్వాన్ని ప్రోత్సహించి, దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్టీ స్థానాల్లో పార్టీ జెండాను రెపరెపలాడేలా చేసింది. బెంగాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఇవన్నీ బీజేపీని మరింత బలోపేతం చేశాయి. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం పార్టీని విజయతీరాలకు చేర్చింది.

ఓవైపు ఉత్తరాదిలో దూసుకుపోతున్నా.. దక్షిణాదిలో మాత్రం బీజేపీ అంచనాలు నిజం కావడం లేదు. అనుకున్న విధంగా ముందడుగు సాగడం లేదు. గతంతో పోల్చుకుంటే గణనీయంగా సీట్లను సాధించినప్పటికీ… పూర్తి స్థాయిలో ఆ ప్రణాళికలు అమలు కావడంలేదు. గతంలో కర్నాటకలో అనూహ్య విజయాల సాధించిన బీజేపీ, ఈసారి అక్కడ ఇబ్బందిపడుతోంది. అందుకే జేడీఎస్‌తో కలిసి ఎన్నికల్లో కొట్లాడాలని భావిస్తోంది. తెలంగాణలో గతంలో 4 సీట్లలో విజయం సాధించగా ఈసారి 10 సీట్లను లక్ష్యంగా నిర్దేశించుకొంది. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రెండు రాష్ట్రాల్లో ఈసారి బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందన్నదానిపై స్పష్టత కరువైంది. ఆ లోటును మిగతా చోట్ల పుడుచుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. తమిళనాడులో ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఎలా పర్ఫామ్ చేస్తోందన్నది చూడాలి. మొత్తంగా దక్షిణాదిలో ఉన్న స్థానాల్లో గత ఎన్నికల 29 స్థానాలు గెలుచుకున్న కాషాయం పార్టీ ఈసారి అంతకుమించి సీట్లలో గెలవాలని ఆరాటపడుతోంది. మరోవైపు మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ చీలిక టీమ్‌లతో, అవగాహన కుదుర్చుకొని ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. బీహార్‌లో నితీష్ కుమార్ ఈసారి బీజేపీని దెబ్బకొట్టాలని చూస్తున్నారు. ఇక బెంగాల్‌లో గతంలో బీజేపీకి ఉన్న సానుకూలత ఈసారి ఏమేరకు ఉంటుందన్నది చూడాలి.