ఈనెల 20న హాజరు కావాలని కవితకు ఈడీ నోటీసులు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కల్వకుంట్ల కవితకు తాజాగా నోటీసులు అందజేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆమెను ఈ కేసులో అనుమానితులుగా పేర్కొంది. ఈ కేసులో ఆమెను సాక్షిగా పిలిచిన సంగతి తెలిసిందే. ఈనెల 20న వ్యక్తిగతంగా అధికారుల ముందు హాజరుకావాలని పేర్కొంది. మరోవైపు మద్యం కుంభకోణం కేసులో రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో పిళ్లై కస్టడీని కోర్టు మూడు రోజుల పాటు పొడిగించింది. అయితే ఎమ్మెల్సీ కవితతో పాటు పిళ్లైని కూడా విచారించాలని ఈడీ పేర్కొంది. ఈ కేసులో గురువారం విచారణకు కవిత హాజరుకాకపోవడంతో పిళ్లై కస్టడీని పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. దీంతో కోర్టు ఈడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా మద్యం కుంభకోణం కేసులో కవిత అనుమానితులుగా ఉన్నారని ఈడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో గురువారం ఈడీ ఎదుట హాజరు కావాల్సిన ఎమ్మెల్సీ కవిత ట్విస్ట్ ఇచ్చారు. విచారణకు హాజరు కాలేనని… లాయర్ ద్వారా సమాచారం పంపారు. ఈడీ దర్యాప్తుపై స్టే విధించాలన్న పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, ఈడీకి 6 పేజీల లేఖ రాశానని కవిత పేర్కొన్నారు.