NewsTelangana

కవితకు ఈడీ నోటీసులు.. కష్టాలు తప్పవా..?

ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం కేసు సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు మెడకు చుట్టుకుంటోంది. ఈ వ్యవహారంలో ఆమెకు కష్టాలు తప్పేట్లు లేవు. శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కవితకు నోటీసులు ఇచ్చింది. కరోనా సోకడంతో కవిత క్వారంటైన్‌లో ఉన్నందున నోటీసులను ఆమె సహాయకులకు ఈడీ అందజేసింది. మరోవైపు గతంలో కవిత పీఏగా పనిచేసిన అభిషేక్‌ రావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. కవిత అకౌంటెంట్‌గా పని చేసిన గోరంట్ల బుచ్చిబాబు ఇంట్లోనూ శుక్రవారం ఈడీ సోదాలు నిర్వహించింది.

కవిత సీఏ ఇంట్లోనూ సోదాలు..

హైదరాబాద్‌లో ఈడీ నిర్వహించిన సోదాల్లో వ్యాపారవేత్తలు, చార్టెడ్‌ అకౌంటెంట్లు కూడా ఉన్నారు. దోమలగూడలోని అరవింద్‌ నగర్‌లో గల శ్రీ సాయి కృష్ణ రెసిడెన్సీలో నివసిస్తున్న కవిత చార్టెడ్‌ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చిరెడ్డి ఇంట్లో, గచ్చిబౌలిలోని అభినవ్‌ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఈడీ అధికారులు 25 బృందాలుగా ఏర్పడి బెంగళూరు, నెల్లూరు సహా దేశంలోని 40 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో హైదరాబాద్‌ లింకులపై ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని కోర్టుకే అందజేస్తామని ఢిల్లీకి చెందిన బీజేపీ నేతలు స్పష్టం చేశారు.

ఎలాంటి నోటీసులు అందలేదు: కవిత

ఈడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని కవిత స్పష్టం చేశారు. ఢిల్లీలో కూర్చొని కొందరు మీడియా సంస్థలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఓ ప్రకటనలో ఆరోపించారు. మీడియా తన సమయాన్ని వాస్తవాలను ప్రసారం చేసేందుకు వినియోగించాలని, తప్పుదోవ పట్టించేవారి బుట్టలో పడొద్దని చురక అంటించారు. టీవీ వీక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేసేందుకే తాను ఈ ప్రకటన చేస్తున్నానన్నారు.