వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటేయొద్దు.. వైఎస్ వివేక కుమార్తె సునీత
ఏపీలో మళ్లీ వైసీపీ సర్కారు వస్తే కష్టాలు తప్పవన్నారు వైఎస్ వివేక కుమార్తె సునీత. వచ్చే ఎన్నికల్లో తన అన్న జగన్ వైసీపీకి ఓటేయొద్దని ఆమె పిలుపునిచ్చారు. తన తండ్రి హత్య విషయంలో జరుగుతున్న డ్రామా, అంతా వైఎస్ జగన్ కనుసన్నల్లో జరుగుతుందని ఆమె విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని ఇంకా రక్షిస్తూనే ఉన్నారని ఆమె ధ్వజమెత్తారు. అవినాష్ రెడ్డి అరెస్టు కోసం వెళ్లినప్పుడు కర్నూలులో ఏం జరిగిందో అందరికీ తెలుసునన్నారు. అరెస్ట్ చేయాడినికి వెళ్లిన సీబీఐ వెనక్కి వచ్చిన సందర్భం దేశంలో ఉందా అని ఆమె ప్రశ్నించారు.

హైదరాబాద్‌కు కేసు బదిలీ అయ్యాకే విచారణ జరుగుతోందన్నారు. న్యాయం కోసం ఐదేళ్లుగా పోరాడుతున్నా.. పట్టించుకోవట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాట తప్పను.. మడమ తిప్పనని అంటున్నారు… మరి వివేక హత్య విషయంలో ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. పేదలు, పెత్తందార్లకు మధ్య యుద్ధమంటున్నారు… కానీ తమ అనుకునేవాళ్లకే న్యాయం చేస్తారా అంటూ జగన్‌ను సునీత నిలదీశారు. నిందితులు బెయిల్ పై బయటకు వస్తే… కేసును ప్రభావితం చేస్తారన్నారు. వివేక హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఎందుకు పూర్తి కావట్లేదని ఆమె ప్రశ్నించారు.

700 మందికి పైగా ఉన్న ఫ్యామిలీలో విభేదాలున్నా కలిసే ఉంటాం కానీ, చంపుకునే భావన ఉండదన్నారు సునీత. నా పోరాటం న్యాయమని చెబితే తనకు మద్దితవ్వాలని, ఓటు రూపంలో చెప్పాలని కోరారు. ప్రత్యక్ష ఎన్నికల్లో రాబోతున్నారా అన్న ప్రశ్నకు ఆమె నేరుగా సమాధానం ఇవ్వలేదు. ఏం జరుగుతుందో చూద్దామన్నారు. ప్రభుత్వం మారితే న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు. హత్యారాజకీయాలు ఉండకూడదన్నదే తన విధానమన్నారు.

