నిర్మలా సీతారామన్ వీడియోను నమ్మకండి..
ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్(Nirmala Sitharaman) వ్యాఖ్యలతో ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి సహకారంతో అభివృద్ధి చేసిన ఓ పెట్టుబడి వేదికను నిర్మలా సీతారామన్ ప్రమోట్ చేస్తూ మాట్లాడేలా, ఈ స్కీమ్ రూ.21వేల పెట్టుబడి పెడితే నెలకు రూ.15లక్షలు వరకు సంపాదించవచ్చని ఆమె హామీ ఇస్తున్నట్లుగా సదరు వీడియోలో రికార్డయింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇది డిజిటల్ గా మార్పు చేసిన వీడియో అని స్పష్టం చేస్తూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ (PIB fact check) విభాగం ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసింది. ఈ తరహా స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం గానీ, నిర్మలా సీతారామన్ గానీ ప్రారంభించలేదు.. ఆమోదించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాంటి అనుమానాస్పద పెట్టుబడులపై వచ్చే సందేశాలను ఎవరూ నమ్మవద్దని కోరింది. ప్రజలంతా ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దేనినైనా నమ్మే ముందు ధ్రువీకరించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. డిజిటల్ టెక్నాలజీ విస్తరిస్తున్నకొద్దీ సైబర్ కేటుగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ డీప్ ఫేక్ వీడియోపై గుజరాత్ సైబర్ పోలీసులు ఎఫ్ ఐఆర్ కూడా నమోదు చేశారు.

