ఈ రోజు బంగారం ధర ఎంతో తెలుసా..?
సెప్టెంబర్ 3న బుధవారం బంగారం ధర సరికొత్త రికార్డును సృష్టించింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,06,100లకు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.97,260లుగా ఉంది. 18 క్యారెట్లతో ఉండే 10గ్రాముల బంగారం ధర రూ. 79,580లు పలుకుతోంది. ఆగస్టు నెల చివరి పది రోజుల్లోనే భారతదేశంలో బంగారం ధర 100 గ్రాములకు రూ. 30,000 కంటే ఎక్కువ పెరిగింది. ఇది ఇటీవలి నెలల్లో జరిగిన అతిపెద్ద పెంపులలో ఒకటి అని పలువురు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.. వచ్చే సీజన్‌కు ముందు ఎక్కువ మంది బంగారం, వెండిని కొనుగోలు చేస్తారనే అంచనాలు ప్రధానంగా బంగారం ధరలు పెరగడానికి కారణం. అంతేకాదు.. దసరా, దీపావళి వంటి పండుగలు వస్తున్నందున వినియోగదారుల డిమాండ్ పెరగడం వల్ల భారతదేశంలో బంగారం ధరలు చారిత్రాత్మక స్థాయికి పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 24 క్యారెట్ల బంగారం అత్యంత ఖరీదైన బంగారం. దీనిని సాధారణంగా పెట్టుబడి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఇకపోతే, 22 క్యారెట్ల బంగారం, 18 క్యారెట్ల బంగారం ప్రధానంగా ఆభరణాల కోసం ఉపయోగిస్తారు. ఈ క్రమంలోనే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధర లక్షా పదివేల రూపాయల చేరువకు వచ్చేసింది. బంగారం ధర విపరీతంగా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్నటువంటి పరిస్థితులే కారణమని చెప్పవచ్చు.

